/rtv/media/media_files/2025/09/17/subbaramireddy-2025-09-17-15-15-39.jpg)
మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలని రావుగోపాల్ రావు ముత్యాలముగ్గు సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు. అవును నిజమే ఈయనలో కాస్త కాదు చాలానే ఉంది. నటుడిగానే కాకుండా కాంట్రాక్టర్ గా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగారు. రాజకీయాల్లోకి వచ్చిన తనకు పేరు తీసుకు వచ్చిన కళామాతల్లిని ఆయన ఎప్పుడూ మరిచిపోలేదు. ఆ కళామాతల్లే ముద్దుగా కళాబంధు అని పిలుచుకునే స్థాయికి వెళ్లారు. ఆయనే తిక్కవరపు సుబ్బరామరెడ్డి(Tikkavarapu SubbaramiReddy ) నేడు ఆయన పుట్టిన రోజు.
1943 సెప్టెంబర్ 17న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించారు సుబ్బరామరెడ్డి. హైదరాబాదు లోని నిజాం కళాశాల నుండి బి.కామ్ పట్టాపొందారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా ఆయన తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆయన చేసిన కృషికి అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామరెడ్డితో వివాహమైంది.
సినిమా రంగంపై ఉన్న మక్కువతో సుబ్బరామిరెడ్డి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించారు. సంస్కృతంలో ఈయన నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. తెలుగులో జీవన పోరాటం, స్టేట్ రౌడి, గ్యాంగ్ మాస్టర్, సూర్య ఐ.పి.ఎస్, త్రిమూర్తులు, వంశోద్ధారకుడు వంటి చిత్రాలను ఈయన నిర్మించారు. తెలుగు చిత్రపరిశ్రమలోని చిన్న,పెద్ద అనే తేడా లేకుండా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు అవార్టులు ఇచ్చి సుబ్బిరామిరెడ్డి సన్మానించేవారు.దీంతో కళాబంధు, కళారత్న, కళా సమ్రాట్, కళాతపస్వి వంటి బిరుదులు ఆయనను వరించాయి.
Also Read : వరుస ఐటమ్ సాంగ్స్ తో దూసుకెళ్తున్న మిల్కీ బ్యూటీ..
అక్కినేని నాగేశ్వరరావు ఇంటి పక్కనే
నిర్మాతగానే కాకుండా నటుడిగానూ సుబ్బిరామిరెడ్డి మెరిశారు. హైదరాబాద్ లో అక్కినేని నాగేశ్వరరావు ఇంటి పక్కనే సుబ్బరామిరెడ్డి ఇల్లు ఉండేది. దాంతో ఏయన్నార్ తో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘బంగారు కలలు’ చిత్రంలో ఆయన కొన్ని క్షణాలు తెరపై తళుక్కుమన్నారు. తెలుగులో ఆయన నిర్మించిన త్రిమూర్తులు చిత్రంలో హీరోలు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారంతా ఓ పాటలో కనిపించారు. ఇది కేవలం సుబ్బరామిరెడ్డితో తమకున్న అనుబంధంతో వీరందరూ అలా కనిపించారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు అందరితో మంచి సంబంధాలున్నాయి. అందుకే సుబ్బిరామిరెడ్డిని ముద్దుగా అజాత శత్రువు అని కూడా పిలుస్తుంటారు.
రాజకీయాల్లో కూడా సత్తా చాటారు సుబ్బిరామిరెడ్డి. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న ఆయన 1996, 1998లో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2002 నుండి 2014 వరకు వరుసగా మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా రాణించారు. 2006 – 2008 మధ్యకాలంలో కేంద్ర గనులశాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. 2012లో నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రాలు విడిపోయాక చాలామంది కాంగ్రెస్ ను విడిచివెళ్లినప్పటికీ సుబ్బిరామిరెడ్డి మాత్రం నమ్ముకున్న పార్టీతోనే ఉండిపోయారు. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీలతో సుబ్బిరామిరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఇక ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉన్న సుబ్బిరామిరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయన ఎక్కడ, ఏ పదవిలో ఉన్న కళాపిపాసను మాత్రం ఆయన మరచిపోలేదు. అందులోనే తన సంతోషాన్ని వెతుకున్నారు. వ్యాపారాల్లో తాను సంపాదించిన సొంత డబ్బుతోనే కళాకారులకు సన్మానిస్తున్నారు.
Also Read : మోదీకి అదిరిపోయే బర్త్‌డే విషెస్.. పవన్, చిరు, మహేష్, ఎన్టీఆర్ ఏమన్నారంటే..?