AP News: ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. నాలుగేళ్ల చిన్నారికి పాజిటివ్

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కావడంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి నీలం కాన్విప్రియకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

New Update
Scrub Typhus fever

Scrub Typhus

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసు నమోదు కావడంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి నీలం కాన్విప్రియకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిరంతర జ్వరం, బలహీనత వంటి లక్షణాలతో చిన్నారిని గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా.. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం చిన్నారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఒకవైపు రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ తాజా కేసు గ్రామీణ ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి?

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుత్సుగాముషి (Orientia tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.. కేవలం సోకిన నల్లి (మైట్) లేదా చిగ్గర్స్ (Chiggers) కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ నల్లులు ప్రధానంగా పొదలు, పచ్చిక బయళ్ళు, గడ్డి, వ్యవసాయ భూముల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధికి స్క్రబ్ టైఫస్ అనే పేరు వచ్చింది.

లక్షణాలను గుర్తించడం కీలకం:

సకాలంలో చికిత్స అందించకపోతే స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకం కావచ్చు. అందుకే ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. నల్లి కరిచిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా 6 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం, ఇది తేలికగా తగ్గదు, నిరంతరంగా ఉండే తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చలి, వణుకు, నల్లి కాటు వేసిన ప్రదేశంలో నల్లటి మచ్చ లేదా పుండు లాగా ఏర్పడటం. ఇది నొప్పి లేకుండా ఉంటుంది. ఇది ఈ వ్యాధికి ప్రధాన సూచన. అంతేకాకుండా విపరీతమైన బలహీనత, అలసట. ఎస్చార్ ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న లింఫ్ నోడ్స్ వాపు వంటి ఉంటుంది. దీనికి చికిత్స చేయడంలో ఆలస్యం జరిగితే.. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపి.. అవయవ వైఫల్యానికి (Organ Failure) దారితీయవచ్చు.

చికిత్స- తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

స్క్రబ్ టైఫస్ అనేది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్ ద్వారా దీనిని సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. సాధారణంగా డాక్సిసైక్లిన్ (Doxycycline) లేదా అజిత్రోమైసిన్ (Azithromycin) వంటి మందులను వైద్యులు సూచిస్తారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభించినట్లయితే.. రోగులు త్వరగా కోలుకుంటారు. అయితే పొలాలకు, తోటలకు లేదా గడ్డి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు DEET (డైఎథైల్‌టొలుఅమైడ్) వంటి కీటక వికర్షకాలను చర్మంపై, దుస్తులపై ఉపయోగించాలి. అంతేకాకుండా పొదలు లేదా గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు పొడవాటి చేతుల చొక్కాలు, ప్యాంటు ధరించి, శరీరం కనబడకుండా పూర్తిగా కప్పుకోవాలి. చిగ్గర్స్ చర్మాన్ని కుట్టకుండా ఉండటానికి ప్యాంటును సాక్స్‌లో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

ఇది కూడా చదవండి: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

ఇంటి చుట్టూ గడ్డి, కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగులు పెరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను నివారించాలి. ఇంకా పొలం పనుల నుంచి లేదా బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే వేడి నీటిలో స్నానం చేయడం, దుస్తులను వేడి నీటిలో ఉతకడం లేదా ఎండలో ఆరబెట్టడం ద్వారా నల్లులు ఉంటే తొలగించవచ్చు. అకస్మాత్తుగా అధిక జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లేదా చర్మంపై నల్లటి మచ్చ గమనిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించి స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోవాలి. ప్రభుత్వపరంగానూ అధికారులు, వైద్య సిబ్బంది ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు (Rapid Response Teams) ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడం, వ్యాధి నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరం. ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ పనులు చేసేవారు ఈ వ్యాధి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో పరువు హత్య.. మాట్లాడదాం రమ్మని మర్డర్!

Advertisment
తాజా కథనాలు