/rtv/media/media_files/2025/08/11/kidnapping-of-a-secretariat-employee-2025-08-11-07-44-28.jpg)
kidnapping of a secretariat employee
AP Crime : ఏపీలో సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు, ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో సోయం సౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. అమె విధుల్లో ఉండగానే నిందితులు కత్తులు చూపించి కొందరు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అన్ని కోణాల్లో విచారించిన పోలీసులకు కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉందని తేల్చారు. దీంతో నాలుగు రోజులు శ్రమించి నిందితులను పట్టుకోవడంతో పాటు సౌమ్యను రక్షించారు.
Also Read: డేంజర్ లో మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్.. విమానంలో కాంగ్రెస్ అగ్రనేత!
రంపచోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన సోయం సౌమ్య శరభవరం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మారేడుమిల్లి మండలం వేటుకూరులో ఆమెకు ఎన్నికల డ్యూటీ పడింది ఆ సమయంలో గ్రామానికి చెందిన కశింకోట అనిల్‌కుమార్ సౌమ్యతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఆమె నిరాకరిస్తూ వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న అనిల్ కిడ్నాప్ కు తెరలేపాడు. కశింకోట అనిల్‌కుమార్ కారులో మరో నలుగురితో ఈనెల 7న ఉదయం 10.30 గంటలకు సచివాలయం వద్దకు వెళ్లి సౌమ్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కత్తులు చూపించి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఖ్యమైన మార్గాలను మూసివేసి చెక్‌పోస్టుల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు.అయితే నిందితులు కారు మార్చడంతో వారిని పట్టుకోవడం కష్టమైంది.
Also Read: ఫేక్ పోలీస్ స్టేషన్‌తో మోసం.. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న కేటుగాళ్లు
ఆ తర్వాత జీపీఎస్ ట్రాకింగ్, సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా జగ్గంపేట మండలం మల్లిశాల ఆలయం వద్ద మరో కారులోకి సౌమ్యను ఎక్కించినట్లు గుర్తించారు. పోలీసులు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వై.రామవరం మండలం గుర్తేడు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సౌమ్యను రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపామన్నారు. నిందితుడు అనిల్‌కుమార్‌కు గతంలో నేరచరిత్ర ఉందని, అతడిపై గంజాయి కేసులతోపాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరితోపాటు సౌమ్య కదలికలపై రెక్కీ నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మాడే మణిమోహన్‌దొర, పూసం పవన్ కుమార్‌లను అదే గ్రామంలో అరెస్టు చేశారు.కిడ్నాప్ కేసులో నిందితులకు సహకరించిన దేవిపట్నం మండలానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అమిత్‌బర్దార్ అభినందించారు. సీఐ సన్యాసినాయుడు, నరేంద్రప్రసాద్, నరసింహమూర్తి, ఎస్సైలు షరీఫ్, వెంకటేష్ పాల్గొన్నారు.
Also Read: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!