AP Crime: కారు ఢీకొని ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. లీక్ అవుతున్న పెట్రోల్!!

చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఢీకొనడంతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Chittoor Crime News

Chittoor Crime News

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాల్యం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ కారు ఢీకొనడంతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. సంక్రాంతి పల్లి గ్రామం వద్ద చిత్తూరు నుంచి పలమనేరు వైపు ఇంధన లోడుతో వెళ్తున్న ట్యాంకర్ ఎదురుగా పలమనేరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా డివైడర్‌పైకి దూసుకెళ్లి ట్యాంకర్‌కు అడ్డుగా వచ్చింది. ఈ ఊహించని పరిణామానికి ట్యాంకర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. వాహనం రోడ్డుపై బోల్తా పడింది.

తప్పిన భారీ ముప్పు..

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత అందులోని పెట్రోల్, డీజిల్ రోడ్డుపై లీక్ అయ్యాయి. పెట్రోల్, డీజిల్ వంటి అత్యంత మండే స్వభావం ఉన్న ఇంధనం రోడ్డుపై పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. సమీపంలోనే సంక్రాంతిపల్లి గ్రామం ఉండటం, పండుగ రోజు కావడంతో ఏమాత్రం నిప్పు రవ్వ తగిలినా పెను ప్రమాదం జరిగి ఉండేదని, ఇళ్లు కూడా మిగిలేవి కాదని ప్రజలు అంటున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో గ్రామస్థులంత ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: గచ్చిబౌలిలో విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించి.. వారి సహాయంతో లీకైన ఇంధనంపై చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పండుగ రోజున జరిగిన ఈ పెను ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

Advertisment
తాజా కథనాలు