/rtv/media/media_files/2025/08/09/pulivendula-zptc-by-election-2025-08-09-16-58-20.jpg)
Pulivendula ZPTC By election
కడపజిల్లా పులివెందులలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నిక(ZPTC Elections) వేళ టీడీపీ, వైసీపీల మధ్య యుద్ధాన్ని తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక్కడ గెలుపు టీడీపీ - వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. వైఎస్ కుటుంబానికి అడ్డాగానే కాకుండా జగన్ సొంత నియోజకవర్గం కావటంతో ఇక్కడ గెలుపును ఈ సారి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పట్టు నిరూపించుకోవటానికి జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. పులివెందుల నియోజకవర్గ మంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెబుతారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1978లో రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరిస్తూ వస్తోంది. ఇక్కడ ప్రతి ఎన్నికా హింసాత్మకంగా సాగుతోందనే విషయం గత చరిత్ర చూస్తే తెలుస్తుంది.
Also Read : జనహిత పాదయాత్ర నాది..మీనాక్షిది కాదు.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Pulivendula ZPTC By Election
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులవెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ(TDP) నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో రెండు కూడా తమ ఫోకస్ అంతా అక్కడే పెట్టాయి. ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి టీడీపీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరోవైపు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అంటూ పోటాపోటీగా తలపడుతున్నాయి. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డి , వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. అభ్యర్థి ఖరారు కావడంతో కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని పూర్తిచేశారు. టీడీపీ ఆలస్యంగా అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుతం ఆ పార్టీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.మంత్రులు బీసీ జనార్ధనరెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఒంటిమిట్టలో నేతలతో సమావేశమై గెలుపు వ్యూహంపై చర్చించారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. 13 గ్రామ పంచాయతీలున్నాయి. బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక టీడీపీ మండలాన్ని ఆరు యూనిట్లుగా విభజించి నేతలకు బాధ్యతలు అప్పజెప్పింది. వైసీపీ రెండో విడత ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ దగ్గరపడడంతో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.ఈ రెండు స్థానాల్లో ఇప్పటికీ గెలుపు ఎవరిది అనేది ఇప్పటికీ అంతు చిక్కటం లేదు. దీంతో.. గెలుపుకోసం చివరి నిమిషం వరకు రెండు పార్టీలు శక్తి మేర ప్రయత్నాలు చేయాల్సిందే. ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనే ఉత్కంఠ పెరుగుతోంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. రెండు చోట్ల, టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. పడుతుండటంతో ఈ ఎన్నికలు కాక రేపుతున్నాయి. పులివెందుల ఉప ఎన్నిక మాజీ సీఎం జగన్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా, నేనా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా ఇక్కడే తిష్ఠ వేశారు. పులివెందులలో వరుసగా రెండురోజుల పాటు టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.పులివెందులలో ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న 8 మంది స్వతంత్ర అభ్యర్థులకు గన్‌మెన్ సౌకర్యం కల్పించారు.ఈ నెల 12న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ రోజున జిల్లాకు రప్పించేందుకు గానూ రెండు పార్టీలు వారికి అవసరమైన రవాణా సదుపాయాన్ని కలిపిస్తున్నారు. వారికి రానూ పోనూ వాహనాలకు అయ్యే ఖర్చును ఇప్పటికే ఓటర్ల అకౌంట్లలో జమ చేశారు. ఎన్నికల నాటికి ఓటర్లకు రెండు పార్టీలు పెద్ద ఎత్తున ముట్టజెప్పేందుకు కూడా సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చూడండి:బోడి గుండుపై జుట్టు పెంచుతామంటూ.. కాకినాడలో కలకలం రేపుతున్న మరో కొత్త మోసం!