Telangana : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతలు దూకుడు పెంచేశారు. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈరోజు భవనగిరిలో పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్‌మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడుతల ఎన్నికల్లో 200 సీట్లకు చేరువయ్యామని.. మిగిలిన విడుతలతో కలిపి 400 సీట్లు గెలవనున్నామని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు.
Also Read: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్
ఫోర్జరీ చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు
తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ మోదీ(PM Modi) ని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగమం చేస్తుంది. కాంగ్రెస్(Congress) పరిస్థితి దయనీయంగా, శోచనీయంగా మారింది. ఆ పార్టీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. భువనగిరిలో రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఫోర్జరీ చేసినందుకు ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది.. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకకపోవడంతో ఆయన కాళ్లు పట్టుకుని మరీ పోటీలోకి దింపింది. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది. మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధం చెబుతున్నారు. మోదీ పదేళ్లో ఎన్నడైనా రిజర్వేషన్లను తొలగించారా?. కానీ కాంగ్రెస్.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కట్ చేసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను అందిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం.
బీజేపీకి పదికి పైగా సీట్లలో గెలిపించండి. మేము ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం. మా మేనిఫెస్టోలో మోదీ గ్యారెంటీలను మీ ముందుంచాం. ఆయన ఏది చెబుతారో దాన్ని తప్పనిసరిగా చేసి తీరుతారు. రాహుల్ బాబా గ్యారెంటీ ఇచ్చి సూర్యాస్తమయంలోపు మరిచిపోతారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు.. ఇప్పటి వరకు అది జరగలేదు. రైతు కూలీలకు 12 వేలు ఇస్తామన్నారు.. అది కూడా పూర్తిచేయలేదు. వరి, గోధుమలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు.. అది కూడా చేయలేదు. రైతులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.5 లక్షల లోన్ ఇస్తామన్నారు, కాలేజీకి వెళ్లే యువతులకు స్కూటీలు ఇస్తామన్నారు, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు.. కానీ అదీ నెరవేర్చలేదు.
మజ్లిస్ పార్టీ అరాచకాలు ఆపగలరా ?
కాంగ్రెస్ రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకుంది.. కానీ మోదీ మందిరాన్ని నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేశారు. రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కశ్మీర్ తో ఏం సంబంధం అని ఖర్గే చెబుతున్నారు. ఖర్గే.. నీకు భువనగిరి వాసుల గురించి తెలియదు.. కశ్మీర్ గురించి ఇక్కడి వారు ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. మోదీ.. దేశంలో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని లేకుండా చేశారు. నక్సల్ సిద్ధాంతాన్ని కూడా సమాప్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీ అరాచకాలను ఆపగలుగుతాయా?. హైదరాబాద్ విమోచనాన్ని కూడా నిర్వహించేందుకు అనుమతివ్వలేదు. సీఏఏను వ్యతిరేకించారు. వీరు షరియత్ ఆధారంగా, ఖురాన్ ఆధారంగా తెలంగాణను నడిపించాలని చూస్తున్నారు.
Also Read: గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన.. ఆరుగురు అరెస్టు
మోదీ తొలగించిన ట్రిపుల్ తలాక్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రధాని..14 వేల కోట్లతో పోచంపల్లిలో ఒక టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేశారు. అలాగే చేనేత కోసం మరో టెక్స్ టైల్ పాలసీని ఏర్పాటు చేశారు. బీబీ నగర్ లో ఎయిమ్స్ ను స్థాపించారు. దీనివల్ల భువనగిరి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. జనగాం, భువనగిరి వరకు రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను చేపట్టారు. కొమురవెల్లిలో అత్యాధునికమైన రైల్వే స్టేషన్ ను నిర్మిస్తున్నారు. రాయగిరి నుంచి వరంగల్ వరకు నాలుగు లైన్ల రహదారి పూర్తయింది. సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
పది సీట్లలో గెలిపించండి
2 లక్షల 31 వేల మంది ప్రజలకు రూ.5 లక్షల వైద్యానికి అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం పేరిట బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పదేండ్లు ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ ఆ పార్టీ కేవలం తమ కుటుంబం బాగు కోసమే పనిచేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు ఐదేండ్లు అవకాశం కల్పించారు.. కానీ ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. తెలంగాణలో బీజేపీకి కనీసం పది సీట్లలో గెలిపించండి.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను మార్చుతామంటూ' అమిత్ షా పిలుపునిచ్చారు.
Also Read: గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు