చంద్రబాబు అరెస్ట్ పై పార్లమెంటులో వైసీపీ, టీడీపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. గల్లా జయదేవ్, మిథున్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఏపీలో చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని గల్లా జయదేవ్ అన్నారు.చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోయిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గల్లా జయదేవ్ ఆరోపణలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఉన్నప్పుడే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. రూ.371 కోట్ల అవినీతి జరిగిందని... సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఇందులో అక్రమం ఏదీ లేదని, రాజకీయ కక్ష సాధింపు లేదని మిథున్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇలా సభలో కాసేపు ఇరు పార్టీల ఎంపీలు మాటలతో కొట్టుకున్నారు. అయితే మధ్యలో స్రీకర్ కలుగజేసుకుని కోర్టులో ఉన్న కేసుల గురించి పార్లమెంటులో మాట్లాడటం సరికాదని ప్యానల్ స్పీకర్ చెప్పడంతో అక్కడతో ఆగింది.
కానీ పార్లమెంటులో ఆపేసిన గొడవను ట్విట్టలో కొనసాగించారు ఇరు పార్టీల నేతలు. అక్కడ గౌరవంగానే మాట్లాడుకున్నా...ట్విట్టర్ దగ్గరకు వచ్చేసరికి తమ స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత దూషణ, బాడీ షేమింగ్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్ తెగ వైరల్ అవుతోంది. మొదట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన వీడియోను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో గొడవ మొదలైంది.
పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ గురించి చెప్పారు. ౠ సంస్థ ఞక డమ్మీదనీ..దాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.1000 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.30 కోట్లకు కేటాయించిందని ఆరోపించారు. ఇందులో పెద్ద స్కామ్ జరిగిందన్నారు. దీనికి సంబంధించిన వీడియోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విటర్‌లో(ఎక్స్) పోస్టు చేశారు. దాని కింద ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ 1947లో ప్రారంభమైందని.. భారత్‌లో గత రెండు దశాబ్దాలుగా ఆపరేషన్స్ నిర్వహిస్తోందని పోస్టులో రాసారు గల్లా జయదేవ్. ఇప్పుడు ఆ కంపెనీ ఏపీలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలో ఎలాంటి అనుమానం లేదని రాసుకొచ్చారు.
దీనికి మిథున్ రెడ్డి వెంటనే స్పందించారు. ఇప్పటివరకూ నెత్తి మీద జుట్టే లేదనుకున్నాను...ఇప్పుడు తల్లో మెదడు కూడా లేదని తెలుసుకున్నాను అంటూ హార్ష్ కామెంట్స్ చేశారు. ఏపీ నుంచి ఇన్వెస్టర్లను వెళ్ళగొట్టేందుకు ఎందుకంత తొందర అని ప్రశ్నించారు. ఇక్కడే తెలుస్తోంది ఎవరు బాధ్యతారాహిత్యంగా ఉన్నారో అంటూ మండిపడ్డారు.
తన మీద బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన మిథున్‌రెడ్డికి... గల్లా జయదేవ్ కౌంటర్ ఇచ్చారు. తన శరీరం, తెలివితేటలపై చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. ఈ విషయంలో ఎవరు గెలిచారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. అలాగే పెట్టుబడిదారులను ఎవరు బెదిరిస్తున్నారో, వెంటబడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి సంబంధించి కియా కార్ల కంపెనీ ప్రారంభోత్సవంలో ఆ కంపెనీ ప్రతినిధిని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను బెదిరిస్తున్నట్లు ఉన్న ఫోటోను ఎంపీ జయదేవ్ పెట్టారు.
కియాకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానమంటూ కియా ప్రకటనను ఎంపీ మిథున్‌రెడ్డి చూపించారు. ఆ కంపెనీ ఏపీ నుంచి ఎక్కడికీ వెళ్ళడం లేదని కియా మోటర్స్ ప్రకటించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారని గల్లా జయదేవ్‌ను ప్రశ్నించారు. ఎంపీగా బాధ్యతగా ఎలా మెలగాలో మీకు తెలియదా? లేక మీ నుంచి ఎక్కువగా ఆశిస్తున్నామా? అంటూ విరుచుకుపడ్డారు.
అయితే కియా ఎక్కిడికీ వెళ్లట్లేదంటూ మిథున్‌రెడ్డి జోడించిన క్లిప్పింగ్‌ను గల్లా జయదేవ్ కొట్టిపారేశారు. ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి సేల్స్ హెడ్ అని తెలిపారు. ఇలాంటి కీలకమైన విషయాలను సీఈవో లేక ఎండీ స్పందిస్తేనే విలువ ఉంటుందని పేర్కొన్నారు. ఓసారి బెదిరింపులకు గురైన వ్యక్తి ఇచ్చే ప్రకటన చెల్లబోదని వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఇద్దరు ఎంపీలు ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పెద్ద వారే చేసుకున్నారు. దీని మీద నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు. మాటల వరకూ ఓకే కానీ బాడీ షేమింగ్ చేయడం మాత్రం అస్సలు బాలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.