Iran Vs Israel: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా?

పశ్చిమాసియాలో పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న అనుమానాలు రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అమెరికా,భారత్ వంటి దేశాలు ఇజ్రాయెల్లో తమ ఉద్యోగుల ప్రయాణాన్ని పరిమితం చేశాయి.

Iran Vs Israel: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా?
New Update

Iran Vs Israel War: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ప్రపంచ దేశాలు యుద్ధ భయంతో ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాలతో సతమతమవుతున్న ప్రపంచం దేశాలు మరో మారణహోమాన్ని భరించక తప్పదా అని ఆలోచిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ సమాధానంగా అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు ఇరాన్‌ ఉరకలేస్తోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌ దాడులు చేసే అవకాశముందని అమెరికా నిఘా వర్గాలు సైతం హెచ్చరిస్తున్నాయి.

ఆ దాడులే అంతటికీ కారణం..

దీనంతటికీ కారణం ఇజ్రాయెల్ 11 రోజుల క్రితం సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌ మీద దాడి చేయడమే. ఏప్రిల్‌ ఒకటోతేదీన ఇజ్రాయెల్‌ దాడిలో ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఇప్పుడు ఈ చర్యకు ప్రతీకారంగా ఇరాన్ రానున్న 24 లేదా 48 గంటల్లో దాడి చేయవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్‌ అవీవ్‌పై విరుచుకుపడేందుకు ఇరాన్‌ సిద్ధమైందనట్లు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ కూడా ఈ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధం అంటోంది. ఎలాంటి దాడులను అయినా ఎదుర్కొంటామని చెబుతోంది. అయితే అమెరికా మాత్రం దీనికి అడ్డుపడుతోంది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ యుద్ధం జరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా, టర్కీ, సౌదీ అరేబియా, ఇంకా పలు యూరోపియన్ దేశాల వారితో మాట్లాడి ఇరాన్..ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా ఉండేందుకు చర్చలు జరుపుతున్నారు. కానీ ఒకవేళ ఇరాన్ దాడి అంటూ చేస్తే తాము మాత్రం ఇజ్రాయెల్‌కే సంపూర్ణ మద్దతు ఇస్తామని చెబుతోంది యూఎస్. ఇరాన్‌ను ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి సంయుక్తంగా ఎదుర్కొంటాయని అంటోంది.

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లోనే కాకుండా రివల్యూషనరీ గార్డ్‌కు దగ్గరగా ఉన్న హైఫా విమానాశ్రయం, డిమోనాలోని అణుకేంద్రం మీద కూడా ఇరాన్ దాడుల చేస్తుందని...సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెలువడ్డాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే భయం మరింత పెరిగింది. అలాగే జెరూసలెంలో ప్రధాన మంత్రి కార్యాలయం మీద కూడా దాడులు జరగవచ్చని అంటున్నారు. అయితే ఇరాన్ ఈ దాడులను ప్రత్యక్షంగా చేస్తుందా లేదా ప్రాక్సీ నెట్ వర్క్ మీద ఆధారపడుతుందా అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.

దాడి ఎలా చేయొచ్చు..
అయితే కొన్ని నివేదికలు మాత్రం ఇరాన్ , ఇజ్రాయెల్ మీద ప్రత్యక్షం దాడి చేయకపోవచ్చని అంటున్నాయి. బాలిస్టిక్ లాంగ్ రేంజ్ క్షిపణులతోనే దాడులు చేయవచ్చని చెబుతున్నారు. ప్రత్యక్ష దాడికి దిగితే అది యుద్ధంగా మారుతుందని...ఇరాన్ దానికి సాహసించకపోవచ్చని అంటున్నాయి. దానికి బదులుగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అట్లాంటిక్ కౌన్సిల్ డైరెక్టర్ జోనాథన్ పానికోఫ్ . ఒకవేళ ఇది కాకపోతే మాత్రం ఇరాన్ హమాస్, హెజ్బుల్లా, కతీబ్ హెజ్బుల్లా, హౌతీల సహాయంతో ఇజ్రాయెల్ సరిహద్దుల మీద దాడికి దిగుతుందని చెబుతున్నారు. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించే క్షిపణుల భారీ నిల్వను కలిగి ఉంది. అయితే ఇందుకు హెజ్బుల్లా సిద్ధంగా లేదని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగడం దానికి ఇష్టం లేదని నివేదికలు తెలిపాయి.

ఉద్రిక్తతలు పెరగకుండా అడ్డుపడుతున్న అమెరికా..

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణాన్ని శాంతింప చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ సైతం స్పందించారు.తాము అనుకున్న సమయం కంటే ముందే ఇరాన్‌ దాడులు చేసేందుకు ప్లాన్‌ చేస్తోందని అయితే తాము మాత్రం ఇజ్రాయెల్‌ రక్షణకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇజ్రాయెల్‌ను రక్షించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. ఈ యుద్ధంలో ఇరాన్‌ విజయం సాధించదు అని కామెంట్స్‌ చేశారు. మరోవైపు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ మైకెల్‌ ఎరిక్‌ కొరిల్లా ఇజ్రాయెల్‌ చేరుకుని..వారి యుద్ధ సన్నద్ధతను పరీక్షించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్‌ గాలాంట్‌తో కలిసి హెట్జోర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఇజ్రాయెల్, అమెరికాలను ఓడించడం ఇరాన్‌కు అంత సులభం కాదని ఎరిక్ వ్యాఖ్యానించారు.

ఇక ఇరాన్ కనుక దాడులకు పాల్పడితే...తాము ఆ దేశానికి అండగా ఉండమని చెబుతున్నాయి అరబ్ దేశాలు. ఖతార్, కువైట్‌లో ఇప్పటికే ఈ మేరకు ప్రకటనలు చేశాయి. ఇరాన్ దాడులకు తమ దేశ గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతినివ్వమని చెబుతున్నాయి. సౌదీ అరేబియాతో సహా మిగతా అరబ్‌ దేశాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. మరోవైపు రష్యా, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు సంమయమనం పాటించాలని అమెరికా కోరుతోంది. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ అన్ని దేశాలతోనూ చర్చలు జరుపుతున్నారు. వీటన్నింటితో పాటూ ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిని ఖండిస్తూ UN భద్రతా మండలి స్పందిస్తే కనుక యుద్ధాన్ని ఆపవచ్చని అమెరికా అభిప్రాయపడుతోంది. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మాత్రం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Also Read:CSDS Survey: ఎన్నికల సంఘంమీద నమ్మకం తగ్గింది..సీఎస్డీఎస్‌ సర్వేలో సంచలన విషయాలు

#usa #israel #iran #war #attacks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe