వరల్డ్ కప్ మెగా టోర్నీ ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది. ఆదివారం ఫైనల్స్ తర్వాత అన్ని టీమ్ లు ఇంటికి వెళ్ళిపోతాయి. కానీ ఆస్ట్రేలియా మాత్రం ఇక్కడే ఉండిపోతోంది. మెగా టోర్నీ తర్వాత భారత్-ఆస్ట్రేలియాల మధ్య టీ20 సీరీస్ జరగబోతోంది. ఈ సీరీస్ లో రెండు జట్లు 5 టీ20 మ్యాచ్ లు ఆడతాయి. టీ20 సీరీస్ నవంబర్ 23 నుంచి మొదలవుతాయి. మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో ఉంది. దీని టికెట్ల విక్రయం మొదలయింది.
Also read:వరల్డ్ కప్ ఫైనల్ కు ఫుల్ హంగామా..గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
మొదటి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం ఆన్ లైన్ లో ఎప్పుడో మొదలయ్యింది. అక్కడ పూర్తయిన తర్వాత ఆఫ్ లైన్ లో కూడా అమ్మతున్నారు. ఈ టికెట్ల కోసం విశాఖ యూత్ కౌంటర్ల దగ్గర ఎగబడ్డారు. మధురవాడలోని క్రికెట్ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని ఇండోర్ స్టేడియంలో టికెట్లను విక్రయిస్తున్నారు. రూ.600, 1,500, 2,000, 3,000, 5,000 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. వీటికి స్టేడియం దగ్గర జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు.
టికెట్లు ఈరోజు అమ్ముతారని ముందే ప్రకటించారు. దీంతో కొంతమంది నిన్న రాత్రే స్టేడియానికి చేరుకుని అక్కడే పడుకున్నారు. తెల్లవారిన దగ్గర నుంచీ టికెట్ల కోసం క్యూలో నిలబడ్డారు.