గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.
ఘాట్ రోడ్డులోకి భక్తులను అనుమతించడం లేదు అధికారులు. కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఘాట్ రోడ్డు మూసివేసి.. ప్రస్తుతం విరిగిపడ్డ కొండ చరియల్ని అధికారులు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులను అనుమతించడం లేదు.
విజయవాడ కస్తూరిబాయ్ పేటలో కూడా ఇంటిపై కొండ రాళ్లు విరిగిపడ్డాయి. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు.. సిటీని ముంచుతున్నాయి. ఘటనా స్థలాన్ని సీపీఎం నేతలు పరిశీలించారు. కొండ చరియలు విరిగి పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.