Mahalaya Amavasya: నేడే మహాలయ అమావాస్య..ఎంగిలిపూల బతుకమ్మకు శ్రీకారం

మహాలయ అమావాస్య పితృదేవతల ప్రీతి కోసం నిర్దేశించింది. వంశాభివృద్ధి కలగాలన్నా, పితృ దోషాలు తొలగలన్నా మహాలయ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. పితృ రుణాన్ని తీర్చే పర్వం కాబట్టి పితృపక్షం అని ప్రసిద్ధి. దాన్నే  ‘మహాలయం’గా పిలుస్తున్నారు.

New Update
Bathukamma

Bathukamma

Mahalaya Amavasya: ఏడాదిలో చాలా అమావాస్యల్లో  మహాలయ అమావాస్య పితృదేవతల ప్రీతి కోసం నిర్దేశించింది. వంశాభివృద్ధి కలగాలన్నా, పితృ దోషాలు తొలగలన్నా మహాలయ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది.   పితృ రుణాన్ని తీర్చే పర్వం కాబట్టి పితృపక్షం అని ప్రసిద్ధి. దాన్నే  ‘మహాలయం’గా పిలుస్తున్నారు. ‘మహం ఆలం యాత్‌ ఇతి మహాలయం’ అని వ్యుత్పత్తి. ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాల ద్వారా పితరులు చాలినంత తృప్తిని పొందుతారు గనక దీన్ని ‘మహాలయ పక్షం’ అని అన్నారు. దీనిలో అమావాస్య తిథిని మహా పితృపర్వంగా చెబుతారు. పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనదిగా భావించే మహాలయ అమావాస్య ఈ ఏడాది ఈ రోజు సెప్టెంబర్‌ 21న వచ్చింది.ఈసారి అమావాస్య పంచాంగ ప్రకారం ఆదివారం రోజు రావడం విశేషంగా చెబుతున్నారు. ఈ రోజు మరణించిన పూర్వీకులకు తర్పణాలు వదలడం, పిండప్రదానం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. తెలుగు పంచాంగం ప్రకారం ఆదివారం, అమావాస్య కలసి రావడం చాలా విశేషంగా భావిస్తారు. ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య కలిసి రావడం ఒక విశేషమైతే, అది మహాలయ అమావాస్య కావడం మరింత విశేషమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. 

తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది నెలకు ఒకటి చొప్పున12 అమావాస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా పితృదేవతలను ఆరాధించడానికి శ్రేష్ఠమైనవే! కానీ భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా జరుపుకోవడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. తక్కిన అమావాస్యల్లో మరణించిన పూర్వీకుల కోసం ఏమి చేసినా చేయకపోయినా పర్వాలేదు. కానీ  భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్య రోజు మాత్రం పూర్వీకులకు కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించి తీరాలని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల పూర్వీకులకు సద్గతులు కలుగుతాయని నమ్ముతారు. అందుకే మహాలయ అమావాస్యకు విశిష్టత ఉంటుంది.ఈ రోజు అనగా ఆదివారం సెప్టెంబర్ 21 వ తేదీ భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా జరుపుకుంటున్నారు.  ఇందులో ప్రత్యేకత ఏంటంటే   వేరే ఏ పూజలైనా సూర్యోదయంలో చేస్తారు. కానీ పితృ దేవతల ప్రీతి కోసం చేసే పూజలు మాత్రం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో చేయాలని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ సమయంలోనే పూర్వీకులకు తర్పణాలు విడిచి పెట్టాల్సి ఉంటుంది.  

తీర్చుకోవలసిన  మూడు రుణాలు..


మానవజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు మూడు రుణాలు తప్పకుండా తీర్చుకోవాలని గరుడ పురాణం చెబుతోంది. అవి ఒకటి దేవరుణం, రెండవది ఋషిరుణం, మూడవది పితృరుణం. ప్రతినిత్యం ఇంట్లో దేవతారాధన చేయడం వలన దేవ రుణం, జ్ఞానాన్ని, ధర్మాన్ని బోధించిన మునులు, గురువులకు కృతజ్ఞతతో ఉండటం ద్వారా రుషి రుణం తీర్చుకోవచ్చు.  అంటే గురువుల బోధనలను గౌరవించడం, వారి సిద్ధాంతాలను అనుసరించడం, వారిని నిత్యం స్మరించుకోవడం ద్వారా రుషి రుణాన్ని తీర్చుకోవచ్చు. ఇక  పితృ రుణం తీర్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. అది మరణించిన మన పూర్వీకులకు, పెద్దలకు ప్రతీ సంవత్సరం శ్రద్ధగా శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా రుణం తీర్చుకోవచ్చు, ప్రతి అమావాస్యకు తర్పణాలు విడవడం, పూర్వీకులకు స్వర్గంలో సద్గతులు కలిగించడానికి వారి పేరిట దానాలు చేయడం వంటి చర్యల ద్వారా పితృ రుణం తీర్చుకోవచ్చు.  

పితృ దేవతల ఆరాధన


మహాలయ అమావాస్య రోజున మంత్రపూర్వకంగా నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అలాగే వేద పండితుల ఆధ్వర్యంలో తిల అంటే నువ్వులతో హోమం చేయడం ద్వారా కూడా దోషాలు తొలగిపోతాయి. మహాలయ అమావాస్య రోజు చేసే సూర్య ఆరాధన కోటిరెట్ల అధిక ఫలం ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం వంటి పరిహారాలతో ఏడాది మొత్తం పితృకర్మలు చేయని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజు విశేషంగా గాయత్రీ జపం చేయడం కూడా ఉత్తమ ఫలితాలనిస్తుంది.పూర్వీకుల పేరిట ఈ దానాలు చేయాలి.


ఎంగిలిపూల బతుకమ్మ

పువ్వులను దైవంగా పూజించే బతుకమ్మ సంబురాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం. భాద్రపద అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుంచి ఈ పండుగ మొదలవుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా బతుకమ్మ పాటలతో ఆడుతూ పాడుతూ జరుపుకునే ఈ పండగ నేటి నుంచి మొదలవుతోంది, ఈ నేపధ్యంలో బతుకమ్మ సంబురాల్లో తొలి రోజు జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ పండగ. భాద్రప్రద మాసం అమావాస్య నుంచి ప్రారంభం అయ్యే ఈ సంబురాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రంగు రంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి .. మహిళలంతా ఒక చోటకు చేరి ఆడి పాడతారు. నేటి ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ పండగ సంబురాలు మొదలవుతాయి. భాద్రపద అమావాస్య ని తెలంగాణలో పెత్ర అమావాస్య అంటారు. ఈ  రోజున పేర్చే తొలి బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. తొలి రోజు బతుకమ్మని పెర్చేందుకు ఒక రోజు ముందే రకారకాల పువ్వులను సేకరించి.. వాటిని నీటిలో వేసి నిల్వ చేస్తారు. ఇలా ఒక రోజు నిద్ర చేసిన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. అందుకనే కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని .. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మ అని పిలుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మకు తులసి దళాలు, వక్కలతో పాటు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తి అయ్యాక ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోడవంతో మొదటి రోజు బతుకమ్మ పూర్తి అవుతుంది.

Advertisment
తాజా కథనాలు