/rtv/media/media_files/2025/08/28/young-man-dies-of-electric-shock-2025-08-28-20-12-39.jpg)
Young man dies of electric shock
Crime News:పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు కరెంట్ కాటుకు బలయ్యాడు. కొద్దిరోజుల్లో పల్లకి ఎక్కి ఊరేగాల్సిన యువకుడు మృత్యువాత పడి పాడె ఎక్కడంతో దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గోపాల్ కుమారుడు అరుణ్‌కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వన్ టౌన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు.విధి నిర్వహణలో భాగంగా పట్టణంలోని కుర్వినిశెట్టి కాలనీలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద బుధవారం రాత్రి మరమ్మత్తులు చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. కాగా అరుణ్ కుమార్‌కు ఇటీవలె వివాహం నిశ్చయం కావడం గమనార్హం.
Also Read: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం..ఎవరు బయటకు రావొద్దు..IMD హెచ్చరిక
వివాహ ఏర్పాట్లతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో అరుణ్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక కురివినిశెట్టి కాలనీలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో ఘటనా స్థలానికి చేరుకున్న అరుణ్ కుమార్ అక్కడి ట్రాన్స్ ఫార్మర్ కు ఉన్న ఏబీ స్విచ్ ఆఫ్ చేసి సమస్య ఉన్న విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. మరమ్మతులు చేయడానికి పైకి ఎక్కిన ఆయనకు పక్కన తేలి ఉన్న విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ ఘాతుకానికి గురై స్తంభం పై నుండి క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏబీ స్విచ్ ఆఫ్ చేసినా అరుణ్‌కుమార్ హై టెన్షన్ బ్రాస్ పట్టి ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందనే విషయాన్ని అరుణ్ కుమార్ గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ విద్యుత్ ఏఈ పేర్కొన్నారు. కాగా ఎల్టీ తీసుకునే విషయంలో అధికారులు ఆంక్షలు విధించడం వల్లే అరుణ్ కుమార్ ప్రాణం కోల్పోయాడని సహచర సిబ్బంది ఆరోపిస్తున్నారు.
Also Read: రాష్ట్రంలో కుంభవృష్టి.. సీఎం రేవంత్ ఏరియల్ పర్యటన
మరణించిన అరుణ్ కుమార్ మృతదేహానికి గురువారం ఉదయం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ఆయన స్వగ్రామం చిన్న రాజమూర్ కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల కన్నీటివీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అరుణ్ కుమార్ అంత్యక్రియల్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. తన కుమారున్ని తలుచుకుని తండ్రి గోపాల్ కన్నీరు మున్నీరుగా విలపించడం అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరిని కంటనీరు పెట్టించింది.
Also Read: కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్