/rtv/media/media_files/2024/11/30/2Vhk1NpROb9iuFoXoJAn.webp)
BRS Working President K.T. Rama Rao
BRS : స్థానిక సంస్థల ఎన్నికలకు డేట్ ఫిక్స్ కానప్పటికీ రాష్టంలోని అన్ని పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. పదేళ్లు అధికారం చేపట్టి ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పొయిన బీఆర్‌ఎస్ స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రచారంలో మరింత జోరు పెంచాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను సస్పెండ్ తర్వాత ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు వెళ్లిన కేటీఆర్ వారం రోజులుగా అక్కడే ఉన్నారు. కేటీఆర్‌తో పాటు ఇతర నేతలు వారం రోజులుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి స్థానిక ఎన్నిలకపై దృష్టి పెట్టాలని హైకమాండ్ నాయకులకు సూచించినట్లు తెలిసింది.
అందులో భాగంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని కేటీఆర్‌కు కేసీఆర్ కీలక సూచనలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం కవిత వ్యవహారం పక్కన పెట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో బుధవారం నుంచి జిల్లాల పర్యటనలకు కేటీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ సూచించారట. బీజేపీకి గ్రామీణ , అర్బన్ ప్రాంతాల్లో పెద్దగా కేడర్ లేదు కనుక పోటీ బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీ మధ్యే ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని, ఇలాంటి సమయంలో కేడర్‌కు మరింత దగ్గర అయ్యేందుకు ప్లాన్ చేయాలని అధినేత సూచించారు. ఓ వైపు స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టడంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేలా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా పార్టీ వీడిన 10మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాలపై మొదట దృష్టి సారించాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఈనెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఆ తర్వాత 13న గద్వాల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దసరా నవరాత్రులు మొదలయ్యేలోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ నిర్ణయించారు. ఇదేక్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా దృష్టి సారించింది. ఎలాగైనా సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. పార్టీ తరపున ఎవరిని నిలబెడితే బాగుంటుందనే విషయంలో నగర ఎమ్మెల్యేలతో చర్చించారు. కాగా ఈ ఎన్నికల్లో మాగంట గోపినాథ్ భార్య సునీతను నిలబెడితే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై చర్చించారు. అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలను రంగంలోకి దింపాలని భావిస్తోంది. అజారుద్దీన్‌కు అవకాశం ఇస్తారని అందరూ భావించినా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో తాజాగా నవీన్ కుమార్, దానం నాగేందర్ పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇక బీజేపీ కూడా తన అభ్యర్థి విషయంలో కసరత్తు మొదలు పెట్టింది. దీంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని తమ అభ్యర్థిని ప్రకటించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
Also Read : Mahindra Cars: జీఎస్టీ ఎఫెక్ట్..భారీగా తగ్గిన మహీంద్రా కార్లు..తక్షణమే అమలు