సంక్రాంతి రోజులు వచ్చేశాయి. మారు మూల ప్రాంతాల్లో ఉన్న వారు తమ గ్రామాలకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయ్. చిన్నా పెద్దా.. ముసలి ముతక తట్ట బుట్ట సర్దుకుని ఓ వారం పాటు తమ సొంత గ్రామాలకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
6,432 స్పెషల్ బస్సులు
గతేడాది సంక్రాంతి సమయంలో 4,484 స్పెషల్ బస్సులను నడపాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ ప్రయాణికుల రద్దీ కారణంగా 5,246 బస్సులను నడిపింది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరిన్ని బస్సులను నడపనున్నారు. దాదాపు 6,432 స్పెషల్ బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో దాదాపు 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఏర్పాటు చేసింది.
Also Read:'గేమ్ ఛేంజర్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
ఈ స్పెషల్ బస్సులను 2025 జనవరి 9 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ బస్సులు హైదరాబాద్‌లోని MGBS, JBS, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, LB నగర్ క్రాస్ రోడ్స్, KPHB, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి సహా మరిన్ని ప్రాంతాల నుంచి బస్సులు బయల్దేరనున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్పెషల్ బస్సులను నడపనుంది. కాకినాడ, అమలాపుం, నర్సాపురం, కందుకూరు, రాజమహేంద్రవరం, పోలవరం, రాజోలు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం, తిరుపతి, విశాఖపట్నం సహా మరిన్ని ప్రాంతాలకు ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి.
అలాగే తిరుగు ప్రయాణం చేసే వారి కోసం కూడా స్పెషల్ బస్సులు నడవనున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో కూడా రిటర్న్ జర్నీ కోసం బస్సులు ఏర్పాటు చేసింది. అయితే స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in లో బుక్ చేసుకోవాలని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440000, 040-23450033 సంప్రదించాలని పేర్కొంది.