/rtv/media/media_files/2025/09/26/terrorists-in-hyderabad-2025-09-26-15-14-10.jpg)
Terrorists in Hyderabad.
Terrorists in Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే ప్రచారంతో మరోసారి కలకలం రేగింది. పలువురు అనుమానితులు హైదరాబాద్‌కు వస్తున్నారన్న సమాచారంతో ప్రత్యేక దర్యాప్తు బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలువురు ఉగ్రవాదులు ట్రైన్‌లో హైదరాబాద్ వస్తున్నారనే సమాచారంతో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో ఆపి ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. చర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్‌కేసర్ పోలీసులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేశారు. వ్యక్తులతో పాటు వెంట ఉన్న బ్యాగేజీని సైతంచెక్ చేశారు. సుమారు గంటకు పైగా తనిఖీలు చేపట్టారు.
ఈ రోజు ఉదయం హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులున్నారంటూ రైల్వే పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపి స్థానిక పోలీసుల సహాయంలో రైల్వే బోగీలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా జనరల్, స్లీపర్, ఏసీ బోగీల్లో అణువణువు నిశితంగా పరిశీలించారు. ఆ క్రమంలో సందేహాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని గుర్తింపు కార్డులు చూపించిన తర్వాత వదిలివేశారు. వారి వ్యక్తిగత వివరాలు సైతం సేకరించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ.. వస్తువులు కానీ తారస పడకపోవడంతో ప్రయాణికులతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అది ఫేక్ కాల్ అయినా అయ్యిండాలి. లేదా ఆకతాయిల పని అయినా అయ్యిండాలి అని పోలీసులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్దారు. మరోవైపు రైలు నిలిపివేయడంతో.. ప్రయాణికులు.. ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుంది.
ఫోన్ చేసిన వ్యక్తి కోసం ఆరా
కాగా శుక్రవారం ఉదయం ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాదులున్నారంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమయిన పోలీసులు రైలు ఆపీ ఈ తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఏ ఫోన్ నెంబరు నుంచి కాల్ చేశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓవైపు ట్రైన్‌లో తనిఖీలు చేస్తూనే.. మరోవైపు కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. దసరా పండగ వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్నారని కాల్ రావడంతో తెలంగాణ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ వ్యప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
Also Read : Anaganaga Oka Raju: ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే