/rtv/media/media_files/2025/05/23/PhBcFW4kvlpoFZxHyHm2.jpg)
Local Body Elections in Telangana
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు గత కొంతకాలంగా వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న ప్రశ్న ఒక మిస్టరీగా మారిపోయింది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ చివరి వారంలో లేదా జులై ప్రారంభంలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రేవంత్ సర్కార్ ప్లాన్ వేస్తోంది. దీంతో పాటు MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని యోచిస్తోంది.
ఎన్నికల కోసం ప్లానింగ్
గ్రామ పంచాయతీలకు ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం, మరికొన్ని త్వరలోనే చేయనుండటం, జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభించడం, అలాగే జూన్‌లోనే ఎక్కువ మందికి రేషన్ కార్డు పంపిణీ చేయడం ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగమేననే తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు.
Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!
గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లల్లో తాజాగా రూ.153 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని పెండింగ్ బకాయిలు రూ.300 కోట్లను కూడా త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదంతా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని సమాచారం. ఇక యువతకు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనుంది. ఈ స్కీమ్ వల్ల 5 లక్షల మంది యువత లబ్ధి పొందనున్నారు. ఇందులో స్థానిక యువతతో పాటు కాంగ్రెస్ కేడర్‌కు కూడా ప్రయోజనం దక్కనుంది.
జూన్ నెలలో ఎక్కువమందికి రేషన్ కార్డులను పంపిణీ చేయాలని.. అలాగే పెండింగ్ రైతు భరోసా నిధులు కూడా ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సీఎం రేవంత్ జిల్లాల పర్యటన చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు.
ఆగిపోయిన నిధులు
ఇదిలాఉండగా గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. ఏడాదిన్నరగా ఎన్నికలు లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1600 కోట్లకు పైగా ఆగిపోయాయి. ఈ ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు కూడా గతేడాది జులై మొదటివారంలో ముగిశాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు ఏప్రిల్‌లో ముగిశాయి. వీటికి కూడా ఆర్థిక కమిషన్ నిధులు ఆగిపోయాయి.
Also Read: ఆపరేషన్ సిందూర్ ఆగలేదు: కేంద్రం
ప్రస్తుతం అన్నిచోట్లా కూడా ఇన్‌ఛార్జ్‌ల పాలనే నడుస్తోంది. ఒక అధికారి ఐదారు గ్రామ పంచాయతీల, మండలాలు లేదా మున్సిపాలిటీలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో బీఆర్‌ఎస్ పార్టీకి బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ పార్టీకి చెందిన వాళ్లు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు సాధిస్తే పార్టీ మరింత బలపడుతుందని భావిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారా ?
మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉంది. ఇటీవల కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ నుంచి పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి నుంచి ఆమోదం వస్తుందా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఇది ఆగిపోతే కాంగ్రెస్‌కు వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అధికారులు కూడా ఏయే తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది.
rtv-news | local-body-elections | bc reservations