/rtv/media/media_files/2025/12/09/suicides-2025-12-09-15-03-14.jpg)
ఊరి కోసం పని చేద్దామని ఎన్నికల బరిలో నిలబడితే.. అంతలోనే కాలం కాటేసింది. గ్రామానికి సర్పంచ్ అవుదామనుకుంటే.. రాజకీయ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో మూడు దశల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బరిలో నిలబడ్డ అభ్యర్థులు డబ్బులు పంచలేక కొందరు, రాజకీయ ఒత్తిడి కారణంగా మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఎన్నికల వేళ ఆందోళనకు గురై గుండెపోటుతో కూడా మరణిస్తున్నారు. మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు గుండెపోటుతో మరణించారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో ఓ అభ్యర్థిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వార్తలన్నీ కలకలం రేపుతున్నాయి. all set for sarpanch election in telangana
Also Read : తెలంగాణలో సల్మాన్ ఖాన్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఎక్కడ, ఏ రంగంలో అంటే?
డబ్బులు పంచలేక సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సీహెచ్ రాజు(36) ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే ఆందోళనతో, నమ్మినవాళ్లే ప్రచారానికి రావడం లేదన్న మనోవేదనతో ఆయన చెట్టుకు ఉరేసుకుని మరణించారు. ఆదివారం రాత్రి తోటి అయ్యప్ప స్వాములతో తన ఆవేదన పంచుకోగా, వారు ధైర్యం చెప్పినప్పటికీ సోమవారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. big update on sarpanch elections
ప్రచారంలో కుప్పకూలిన మహిళ
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మంచర్లగూడలో 8వ వార్డుకు పోటీ చేస్తున్న పల్లె లత (42) ప్రచారం నిర్వహిస్తుండగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.
ప్రత్యర్థుల ఒత్తిడి భరించలేక..
పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసిన యువకుడు ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, కంసాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో 4వ వార్డు మెంబర్‌గా ఆవ శేఖర్ (24) నామినేషన్ వేశాడు. ఇదే వార్డులో ప్రత్యర్ధులు కంది యాదయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి అతనిపై ఒత్తిడి చేశాడు. విత్ డ్రా చేసుకోకపోతే అంతు చూస్తానంటూ తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ బెదిరించాడు. ఈ ఒత్తిడిని తాళలేక మనస్తాపం చెందిన శేఖర్ మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్ పట్టణ పరిధిలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. - Telangana Local Body Elections
వార్డు మెంబర్ ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం చక్రియాల గ్రామంలో 8వ వార్డు అభ్యర్థి కొత్తొల్ల పద్మారావు (50) ఆదివారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణంతో ఆ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య రెండుకు చేరిందని, ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేదని అధికారులు తెలిపారు.
సర్పంచ్ అభ్యర్థి భర్త సూసైడ్
నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ (సోమార్‌పేట్) గ్రామంలో రవీందర్ (54) గతంలో బీర్నంది, ఎర్వచింతల్ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా, నీటి సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఎర్వచింతల్ గ్రామ సర్పంచి పదవి బీసీ-మహిళకు కేటాయించడంతో రవీందర్ తన భార్య పుష్పతో నామినేషన్ వేయించి పోటీలో నిలిపారు. గురువారం ఉదయం తెల్లవారేసరికి ఆయన ఉరి వేసుకుని చనిపోయారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భార్య పుష్ప ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Also Read : తెలంగాణలో ట్రంప్ కంపెనీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బ్యాట్‌తో ప్రచారం చేసి గుండెపోటు
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి(70) గుండెపోటుతో మృతి చెందారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన బుచ్చిరెడ్డి మృతితో నడివాడ గ్రామంలో విషాదం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి బుచ్చిరెడ్డికి బ్యాట్ గుర్తు రాగా సోమవారం ఇంటింటికి తిరుగుతూ రాత్రి వరకు ప్రచారం చేశారు. అనంతరం అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు మహబూబాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు.
ప్రచారం ప్రారంభించగానే ప్రాణాలు కోల్పోయాడు..
ప్రచారం ప్రారంభించిన సర్పంచ్ అభ్యర్థి ఆకస్మికంగా మృతి చెందిన ఘనట రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్ గ్రామంలో విషాదం నింపింది. చింతల్‌ఠాణా (ఎస్సీ రిజర్వ్)లో మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో చర్ల మురళి(53) బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గురువారం రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసి ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటు రావడంతో అస్వస్థత చెందాడు. అభ్యర్థి మృతితో గ్రామంలో ఎన్నికలపై సందిగ్ధం నెలకొన్నది.
Follow Us