/rtv/media/media_files/2025/02/20/W1cefutDY9nUpesI216U.webp)
Communist parties
Communists : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య విచిత్ర పొత్తులు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తో జతకట్టిన లెఫ్ట్​ పార్టీలు ఇప్పుడు తలో దారి వెతుక్కుంటున్నాయి. మీటింగుల్లో కమ్యూనిస్టులం కలిసి పోటీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా ఎన్నికలు వచ్చేసరికి ఎవరి దారి వారు చూసుకుంటు న్నారు. రెండు పార్టీలు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో జత కడుతున్నాయి. ఈసారి కూడా ఎప్పట్లాగే తలోదారిలో వెళ్తున్న రెండు లెఫ్ట్​ పార్టీల్లో సీపీఎం తీరు మరింత విచిత్రంగా తయారైంది. సొంత అస్తిత్వం లేని సీపీఎం కొన్నిచోట్ల కాంగ్రెస్​తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్​తో జతకడుతోంది. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని సీపీఎం నిర్ణయించగా.. సీపీఐ మాత్రం కాంగ్రెస్​తో సీట్ల సర్దుబాటు కోసం గట్టిగా పట్టుబడుతోంది. దీంతో తెలంగాణలో సీపీఐ, సీపీఎం పొత్తుల విషయంలో అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
లెఫ్ట్ భావజాలంతో విప్లవ శక్తిగా నిలిచిన ఎర్రజెండా పార్టీలు, లోకల్ ఎన్నికల కోసం ఏ పార్టీతోనైనా జతకట్టడానికి సిద్ధపడుతుండటం విస్మయం కలిగిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఒకే జిల్లాలో భిన్న పొత్తులకు స్థానిక నేతలు పావులు కదుపుతుండటం కమ్యూనిస్టుల ఐక్యతను ప్రశ్నిస్తున్నాయి. జనగామ జిల్లాలో సీపీఎం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే.. అదే జిల్లాలో చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌తో జత కట్టింది. సిద్దిపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్- సీపీఎం కలిసి పోటీ చేస్తుండగా. చెన్నూరులో కాంగ్రెస్‌కు షాకిచ్చిన లెఫ్ట్ నేతలు.. బీఆర్ఎస్‌తో చేతులు కలిపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఏరియాలో ఒక్కో పార్టీకి మద్దతిస్తూ కమ్యూనిస్టులు తలోదారి నడుస్తున్నారు.
అయితే కమ్యూనిస్టుల తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సీపీఎం, సీపీఐలకు కొంత ఓటు బ్యాంకు ఉంది. కానీ కమ్యూనిస్టులు ఆయా ప్రాంతాల్లో సొంతంగా గెలవలేని స్థితి ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు లెఫ్ట్ పార్టీలను అసలు పోటీగా భావించడం లేదనే భావన సీపీఎం, సీపీఐ కార్యకర్తల్లో ఏర్పడింది. దీంతో తమ ఉనికి కాపాడుకునేందుకు లెఫ్ట్ పార్టీలు తప్పని సరి పరిస్థితుల్లో పొత్తుల కోసం ఆరాటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్నికల సర్వైవల్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ జతకట్టడాన్ని ఐడియాలజీ రాజీ, అవకాశవాదంగా చెబుతున్నారు. అయితే, లెఫ్ట్ పార్టీల్లో కీలక నేతలు మాత్రం ఇలాంటి పొత్తులను ఎత్తుగడలు అంటూ వెనకేసుకొస్తున్నారు. కమ్యూనిజం అజరామరం అంటున్నారు. మొత్తానికి కమ్యూనిస్టుల పరిస్థితి బయటి నుంచి చూస్తే, ఒకప్పటి విప్లవ శక్తి ఇప్పుడు లోకల్ అడ్జస్ట్‌మెంట్స్‌లో చిక్కుకుపోయినట్టు కనిపిస్తోందని అనలిస్టులు చెబుతున్నారు.
Follow Us