/rtv/media/media_files/2025/12/14/congress-2025-12-14-18-07-50.jpg)
Congress
రెండవదశ సర్పంచ్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరు కొనసాగించింది. గ్రామ పంచాయతీ(gram panchayat election 2025) సర్పంచి(Sarpanch Elections), వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయభేరి మోగించారు. రెండవదశలో మొత్తం 4,333 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా సగాని కంటే ఎక్కువ సీట్లను గెలిచి తమ ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి రెండో విడతలోనూ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ కూడా మంచి స్థానాలనే సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులు నిర్మల్ జిల్లాలో మినహా మరే జిల్లాలోనూ అంతగా ప్రభావం చూపలేకపోయారు.
Also Read : రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా.. ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే
మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్
ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల వరకు వచ్చిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2,297 (51.9%), భారత రాష్ట్ర సమితి 1,191 (27.5%), బీజేపీ 257 (6.2%), ఇతరులు 578(14.4%) శాతం స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఎం మద్దతుదారులు 33 చోట్ల, సీపీఐ బలపరిచినవారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2,425 చోట్ల, భారత రాష్ట్ర సమితి 1,168, బీజేపీ 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందిన విషయం తెలిసిందే.
పల్లెల్లో ఓటింగ్ చైతన్యం
పట్ణణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ఓటర్లే చైతన్యవంతులని ఈ ఎన్నికలు(panchayat elections 2025) రుజువు చేశాయి. రాజధాని నగరం హైదరాబాద్‌లో ఓటెయ్యడానికి బద్దకిస్తున్న ఓటర్ల తీరుకు భిన్నంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చారు. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 6 గంటలకే ఓటర్లు పోలింగ్‌కేంద్రం వద్ద క్యూ కట్టారు. దీంతో మొత్తంగా 85.86 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన(84.28%) పోలింగ్ కన్నా ఇది 1.58 శాతం ఎక్కువకావడం గమనార్హం. ఆదివారం సెలవురోజు కావడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణమైంది. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో, 108 వార్డుల్లో నామినేషన్లు రాలేదు. ఇంకో రెండు గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించలేదు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్యులుగా పోటీపడ్డారు.
Also Read : ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి
ఫస్ట్ యాదాద్రి..లాస్ట్ నిజామాబాద్
మొదటి విడతలాగే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్ నమోదైంది. నిజామాబాద్‌లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరగడం గమనార్హం. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళా ఓటర్లలో 23,93,010.. పురుష ఓటర్లు 26,57,702లో 22,77,902 మంది.. ఇతరుల్లో 143కు 60 మంది ఓట్లు వేశారు. ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచి ఎన్నికలను అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యులను సమావేశపరిచి ఉపసర్పంచులను ఎన్నుకున్నారు.
Follow Us