Telangana Police Commissionerate: రాజధాని పోలీస్‌ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ..రాచకొండ.. ఇకపై లష్కర్‌!

హైదరాబాద్‌ నగరం బృహత్‌ నగరంగా విస్తరించడంతో  జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో  రాజధానిలోని పోలీసు కమిషనరేట్లనూ పునర్వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

New Update
FotoJet (41)

Telangana police Commissionerate

Telangana Police Commissionerate: హైదరాబాద్‌(hyderabad) నగరం బృహత్‌ నగరంగా విస్తరించడంతో  జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో  రాజధానిలోని పోలీసు కమిషనరేట్లనూ పునర్వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న జోనల్‌ విధానంలో పలు  లోపాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసు విభాగం ఈ మేరకు మార్పు కోసం కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేరకు ప్రాథమిక కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. శనివారం డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి  ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో మార్పుచేర్పులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే, ఆదివారం  తిరిగి నిర్వహించిన సమావేశానికి పురపాలక, పోలీసు శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రాచ కొండ పేరును లష్కర్‌ కమిషనరేట్‌గా మార్చనున్నట్లు తెలిపారు. అలాగే ఫ్యూచర్‌ సిటీ కోసం కొత్త కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. హైదరాబాద్‌ బల్దియా ఎన్నికల్లోపే నాలుగు కమిషనరేట్లను అమ లులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఉన్న రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, మహేశ్వరంతోపాటు యాదాద్రి జోన్లు ఉన్నాయి. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న నార్త్‌జోన్‌ను రాచకొండ(rachakonda-police) లో కలపనున్నారు. అలాగే రాచకొండలో భాగమైన యాదాద్రి జోన్‌ను ప్రత్యేక జిల్లాగా మార్చే అవకాశం ఉంది. 19 పోలీసుస్టేషన్లతో కూడిన దీనికి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. నార్త్‌జోన్‌తో కలిసి కొత్తగా మారుతున్న రాచకొండ కమిషరేట్‌ పేరును లష్కర్‌ కమిషనరేట్‌గా మార్చనున్నారు. లష్కర్‌ బోనాలకు సికింద్రాబాద్‌ ప్రాంతం నిలయం కావడం... ఈ ఏరియా నార్త్‌జోన్‌లోనే ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్న పటాన్‌చెరుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను, మొయినాబాద్‌ను సైబరాబాద్‌ కమిషనరేట్‌లోకి మారుస్తున్నారు.

సైబరాబాద్‌(cyberabad) కమిషనరేట్‌ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను తీసి హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కలుపుతున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌ జోన్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌లోకి తీసుకుంటారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రస్తుతం ఏడు జోన్లు ఉండగా... సైబరాబాద్‌లో ఐదు, రాచకొండలో నాలుగు జోన్లు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ మూడు కమిషనరేట్లలోనూ కలిపి 12 జోన్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ఆరు, సైబరాబాద్, రాచకొండలో మూడు చొప్పున జోన్లు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని జోన్లను పునర్వ్యవస్థీకరిస్తూ చార్‌ మినార్, గోల్కొండ తదితరాలను మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read :  ఆస్ట్రేలియా ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ..!

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌

సైబరాబాద్‌ ఉన్న కూకట్‌పల్లి జోన్‌లోకి మాదాపూర్‌ ప్రాంతాన్ని తీసుకొస్తూ కొత్తగా కుత్బుల్లాపూర్‌ ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న మహేశ్వరం జోన్‌తోపాటు షాద్‌నగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల తదితరాలు చేర్చుతారు. ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌లోనూ మూడు నుంచి నాలుగు జోన్లు ఉంటాయని తెలుస్తోంది. ముగ్గురు పోలీసు కమిషనర్లతో జరిగిన సమావేశంలో శివధర్‌రెడ్డి కొన్ని కీలక మార్పులు సూచించారు. ఇవి పూర్తయిన తర్వాత ప్రతిపాదనల్ని సీఎం రేవంత్‌రెడ్డి ముందు ఉంచనున్నారు. ఆయన ఆమోదంతో పునర్వ్యవస్థీకరణకు తుది రూపు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండకు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఐజీ) స్థాయి అధికారులు కమిషనర్లుగా ఉంటున్నారు. దీన్నే కొనసాగిస్తూ ఫ్యూచర్‌ సిటీకి ఐజీ స్థాయి అధికారినే నియమించాలని అధికారులు భావిస్తున్నారు.

Also Read :  అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. మాజీ సర్పంచ్ ల ఆందోళన

150 ఏళ్ల చరిత్ర: హైదరాబాద్‌ పోలీస్​ కమిషనరేట్‌కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో కొత్వాల్‌- ఇ- బల్దా పేరుతో పోలీస్‌ కమిషనర్‌ను నియమించే వారు. నగరంలో శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తూ నేరుగా నిజాం రాజుకు రిపోర్టు చేసేలా ఈ పోలీసు వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో రాజాబహదూర్‌ వెంకట్రామిరెడ్డి శక్తివంతమైన కొత్వాల్‌గా పని చేసినట్లు చెబుతారు.1955 ఆగస్టులో శాంతి భద్రతల డీసీపీ ఆధ్వర్యంలో డీసీపీ, 4 డివిజన్లు, 34 పోలీస్​ స్టేషన్లుగా మార్చారు. 1981 ఆగస్టులో నాలుగు జోన్లు, 12 డివిజన్లకు చేరింది. 2023లో 28 డివిజన్లు, ఏడు జోన్లుగా ఏర్పడింది. ఈ ఏడాదిలోనూ మరోసారి ఠాణాల సరిహద్దులు, పేర్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు