/rtv/media/media_files/2025/08/01/child-marriage-2025-08-01-09-33-11.jpg)
Rangareddy Child Marriage
Child Marriage: బాల్య వివాహాలను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ దేశంలో ఏదో ఒక చోట బాల్య వివాహాల ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందుకు ఆడబిడ్డల తల్లిదండ్రుల పేదరికం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. అటువంటి ఓ ఘటనే రంగారెడ్డి జిల్లా నందిగామలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నందిగామలోని కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్‌కు(40) 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ళ బాలికతో ఇటీవల వివాహం జరిపించారు. ఈ విషయం సదరు బాలిక పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేసింది. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బుధవారం రంగంలోకి దిగారు. బాలిక తల్లితోపాటు వివాహం చేస్తుకున్న శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తిగా వ్యవహరించిన పెంటయ్యలపై కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను ఐసీడీఎస్ అధికారుల సహకారంతో సఖీ కేంద్రానికి తరలించారు.
బాల్య వివాహ నిషేధ చట్టం గురించి సమాచారం:
భారతదేశంలో బాల్య వివాహాలను నిషేధించడానికి ప్రధానంగా ఉన్న చట్టం "బాల్య వివాహ నిషేధ చట్టం, 2006" ఈ చట్టం ప్రకారం.. బాలికకు 18 సంవత్సరాలు వయస్సు నిండకుండా, బాలుడికి 21 సంవత్సరాలు నిండకుండా జరిగే ఏ వివాహమైనా బాల్య వివాహంగా చెబుతారు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పురుషుడు 18 ఏళ్లలోపు బాలికను వివాహం చేసుకుంటే.. అతనికి రెండు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. బాల్య వివాహాన్ని నిర్వహించినా, కుదిర్చినా, ప్రోత్సహించినా తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, మధ్యవర్తులు, వివాహానికి సహకరించిన వారందరూ శిక్షార్హులే. వీరికి కూడా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అయితే ఏ స్త్రీకి ఖైదు విధించబడదు. ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు బెయిల్ రహిత నేరాలు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
బాల్య వివాహం చేసుకున్న పిల్లలు తమకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ వివాహాన్ని రద్దు చేసుకోవడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. బాల్య వివాహం జరగబోతోందని సమాచారం అందిన వెంటనే.. మేజిస్ట్రేట్ ఆ వివాహాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కూడా కఠిన శిక్షలు ఉంటాయి. హింసకు గురైన మహిళలకు, బాలికలకు సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా "సఖీ కేంద్రాలు" లేదా "వన్ స్టాప్ సెంటర్లు" ఏర్పాటు చేశారు. గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు, బాలికలకు ఒకే చోట వైద్య, కౌన్సిలింగ్, పోలీసు, న్యాయ సహాయం, అలాగే తాత్కాలిక వసతిని ఉచితంగా అందిస్తాయి. ఈ కేంద్రాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. బాధితులు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181 ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైన సాయం అందిస్తారు. బాల్య వివాహాలు సమాజానికి హానికరం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లేదా జరగబోతున్నాయని తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్‌కు లేదా సఖీ కేంద్రాలకు సమాచారం అందించడం పౌరులందరి బాధ్యత.
ఇది కూడా చదవండి: తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు
( TG Crime | Latest News | child-marriage )