Panchayat Elections : పల్లెపోరులో హామీల వర్షం.. ఇంటికో రూ. 5లక్షల బీమా.. ఆడబిడ్డ పుడితే 5వేలు

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వారు తమదైన హామీలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు. తమను గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.  

New Update
Local Body Elections

Local Body Elections

గ్రామాల్లో పంచాయతీ ఎన్నిక(gram panchayat election)ల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికలను పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువమంది ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. గ్రామ స్థాయి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశంతో పలువురు సర్పంచ్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో వారు తమదైన హామీలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు. తమను గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.  అంతేకాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మధ్యలోనే దిగిపోతాను అంటూ ప్రతినబూనుతున్నారు. 

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్‌ తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5లక్షల చొప్పున జీవిత బీమా చేయిస్తానని హామీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆ ఊర్లో 700 ఇండ్లు ఉన్నాయి.  ప్రతి ఇంటికి ఏడాదికి రూ.1200 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.8.40 లక్షలు.. ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అవుతుంది.  అయినా తానే బీమా చేయిస్తానంటున్నారు.ఇది మాత్రమే కాదు. మొత్తంగా 15 హామీలతో ఆమె మేనిఫెస్టో రూపొందించడం గమనార్హం. - general-insurance

Also Read :  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..

Panchayat Elections 2025

వాటిలో ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5వేల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, ఆడబిడ్డ పెళ్లికి పుస్తెమట్టెలు చేయిస్తానని, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని మాటివ్వడం విశేషం. అలాగే ఊర్లో నెలకోసారి మెడికల్‌ క్యాంపు నిర్వహణ, శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి రూ.15వేల ఆర్థికసాయం, ఇల్లు కట్టుకునేవారికి స్లాబ్‌ వేసుకునే సమయంలో రూ. రూ.21వేలు ఆర్థిక సాయం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, శివరాత్రి, శ్రీరామ నవమి, మొహార్రం పండుగల సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్‌లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అంతేకాక గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని, దహన సంస్కారాలకు రూ.10వేలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం వితరణ చేస్తానని ఆమె ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నారు.

ఇక  గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా ఆంజనేయులు అనే వ్యక్తి నామినేషన్‌ దాఖ లు చేశారు. ఆయన  గ్రామంలో అమలు చేయనున్న 22 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా వంద రూపాయల బాండ్‌ పేపర్‌పై ఆ హామీలను అమలు చేస్తానని రాసిచ్చారు. ఈ హామీలను నెరవేర్చకపోతే పదవి నుంచి తప్పుకొంటానని ప్రకటించడం విశేషం. గ్రామానికి అంబులెన్స్‌ సౌకర్యం కల్పించడం, ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్‌, బీసీ స్మశానవాటికకు ఫెన్సింగ్‌, బోరు వేయించి, మోటారు ఏర్పాటు చేసి తాగు నీటి వసతి కల్పించడం వంటి  హామీలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వితంతు మహిళలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 10 వేల సాయం, ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, ఊర్లో బీటీరోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని కూడా ఆయన హామీ ఇచ్చారు.

Also Read :  మా పెదనాన్నను కోర్టులో హాజరుపరిచేలా చూడండి..సీఎం రేవంత్‌కు మావోయిస్టు దేవ్‌జీ కూతురు సంచలన లేఖ

Advertisment
తాజా కథనాలు