/rtv/media/media_files/2026/01/23/fotojet-2026-01-23t132034181-2026-01-23-13-21-53.jpg)
ktr phone tapping case
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు(telangana phone tapping) మరోసారి సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) కు నోటీసులు జారీచేసి విచారించిన సిట్ ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. సిట్ విచారణకు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. శుక్రవారం విచారణకు రావాలని గురువారం సిట్ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును విచారించగా.. తాజాగా కేటీఆర్‌కు నోటీస్ జారీ చేసి విచారిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్(phone tapping case updates) జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈకేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్‌ను విచారణకు పిలిచింది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు రెండేళ్లు కావస్తున్నా దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. కేటీఆర్ వెంట హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ పీఎస్ కు చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. స్టేషన్‌కు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకోకుండా జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు... ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?
బీఆర్‌ఎస్ లావాదేవీలపై..
మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన సిట్.. ఆ విషయంపైనే కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో వాటిపైనే సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు బృందం వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాపారి శ్రీధర్ రావు ఫిర్యాదు ప్రకారం.. తనను బెదిరించి 12 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఇప్పించారని, అదనంగా ఓ ప్రైవేట్ పంచాయతీలో మరో రూ.3 కోట్లు ఇప్పించారని ఆయన ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో మరికొందరు వ్యాపారులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శ్రీధర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, సినీనటులు, రాజకీయ నేతలపై బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశాలపై కేటీఆర్ నుంచి సిట్ వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లు సమాచారం.
Also Read : నైనీ టెండరు రద్దు.. ‘సింగరేణి’పై విచారణకు కమిటీ
కట్టుదిట్టమైన భద్రత
కాగా.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పీఎస్‌కు రెండువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావ్ విచారణ సందర్భంగా పీఎస్ బయట ఉద్రిక్తత చోటుచేసుకున్న పరిణామాలతో మరింత పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు అధికారులు. టాస్క్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్, ఏఆర్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో గులాబీ శ్రేణులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
Follow Us