Amrit Bharat Express : పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు...ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?

రైలు ప్రయాణాలను మెరుగు పరచడానికి కేంద్రం నూతన రైళ్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెబుతూ  ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు.

New Update
FotoJet - 2026-01-23T125541.325

Thiruvananthapuram-Charlapalli Amrit Bharat Express

Amrit Bharat Express : రైలు ప్రయాణాలను మెరుగు పరచడానికి కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నూతన రైళ్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెబుతూ  ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు. ఈ రైళ్లు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాంతీయ రైలు అనుసంధానాన్ని మెరుగుపరచనుంది. ఈ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా నాలుగు కొత్త రైలు సర్వీసులను కూడా మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన మోదీ ప్రారంభించిన రైళ్లలో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి–తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్‌ రైలు కూడా ఉంది.

ప్రధాని మోదీ జెండా ఊపగానే, తిరువనంతపురం సెంట్రల్ నుండి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. తిరువనంతపురం సెంట్రల్ నుంచి తాంబరం, నాగర్‌కోయిల్ జంక్షన్ నుంచి మంగళూరు జంక్షన్ వరకు ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఇదే సమయంలో తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10.45 గంటలకు బయలుదేరింది.

కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే:

నాగర్‌కోయిల్- మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

తిరువనంతపురం-తాంబరం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

తిరువనంతపురం-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

FotoJet - 2026-01-23T125614.671

తెలంగాణకు మరోకటి..

నూతన అమృత్‌ భారత్‌ రైళ్లలో తెలంగాణకు మరో అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కేటాయిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు  రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం ప్రయాణికులకు కొంత ఉపయుక్తం కానుంది. చర్లపల్లి జంక్షన్‌ నుంచి తిరువనంతపురం మధ్య ఈ సూపర్‌ ఫాస్ట్ రైలును కేటాయించింది. ఇది తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ.. ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో  ఆగనుంది.  

27 నుంచి రెగ్యులర్‌ సర్వీసులు.. రేపట్నుంచే బుకింగ్స్‌

చర్లపల్లి - తిరువనంతపురం నార్త్‌ అమృత్‌భారత్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు (17041) రెగ్యులర్‌ సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. చర్లపల్లి నుంచి మంగళవారాల్లో ఉదయం 7.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45గంటలకు తిరువనంతపురం చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 28న (బుధవారాల్లో) ఈ రైలు (17042) తిరువనంతపురంలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.30గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలులో ఎనిమిది స్లీపర్‌ కోచ్‌లు, 11 జనరల్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు, ఒక పాంట్రే కార్‌, రెండు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు (దివ్యాంగులకు ఉపయోగకరంగా ఉండేలా) ఉన్నాయి. ఈ రైలు బుకింగ్స్‌ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.  

తొలి రైలు కూడా..

ఇప్పటికే చర్లపల్లి - ముజఫర్‌పూర్ (బిహార్‌) మధ్య ఒక అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును కేంద్రం కేటాయించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక వసతులున్న అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చర్లపల్లి - ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్‌ రైలు తెలంగాణలోని చర్లపల్లి నుంచి ఉదయం 4.05 గంటలకు ప్రారంభమై.. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్‌ మీదుగా మహారాష్ట్రలోకి అడుగుపెడు తుంది. ముజఫర్‌పూర్‌కు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. 

FotoJet - 2026-01-23T125821.196

ఏపీ ప్రయాణీకుల కోసం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మీదుగా మరో అమృత్ భారత్ రైలును రైల్వే శాఖ నడపనుంది. ఇప్పటికే రెండు రైళ్లు ఏపీ మీదుగా వెళుతుండగా.. మరో రైలు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే ఈఅమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ కొత్త సర్వీస్ ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. శనివారం ఉదయం 8.50 గంటలకు ఎస్‌ఎంవీటి బెంగళూరు నుంచి బయలుదేరి.. సోమవారం ఉదయం 10.25 గంటలకు అలీపుర్దువార్ చేరుకుంటుంది. అనంతరం అలీపుర్దువార్ నుంచి సోమవారం రాత్రి 10.25 గంటలకు బయలుదేరి.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఎంవీటి బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలులో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 1 పాంట్రీ కార్, 2 సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ఎస్‌ఎంవీటి బెంగళూరు నుంచి ప్రారంభమయ్యే ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కుప్పం మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. ఉదయం 10.09 గంటలకు కుప్పం వస్తుంది. ఆ తర్వాత రేణిగుంటకు మధ్యాహ్నం 2.30కు, నెల్లూరుకు సాయంత్రం 4.43 గంటలకు, ఒంగోలుకు సాయంత్రం 6.23కు, చీరాలలో 7.03 గంటలకు, తెనాలిలో రాత్రి 7.53 గంటలకు, విజయవాడలో 8.45 గంటలకు, ఏలూరులో 9.53 గంటలకు, రాజమండ్రిలో 11.23 గంటలకు, సామర్లకోటలో అర్ధరాత్రి 12.08 గంటలకు, అనకాపల్లిలో తెల్లవారు జామున 2.33 గంటలకు, దువ్వాడలో 3.50 గంటలకు, పెందుర్తిలో 4.18కి, కొత్త వలసలో 4.28 గంటలకు, విజయనగరంలో ఉదయం 5 గంటలకు, శ్రీకాకుళం రోడ్ లో 5.58 గంటలకు, పలాసలో 7.35 గంటలకు ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఉంటుంది.

అలీపుర్దువార్ నుంచి బయలుదేరే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. పలాసలో అర్థరాత్రి 1.48 గంటలకు, శ్రీకాకుళం రోడ్ 2.43 గంటలకు, విజయనగరం 3.40 గంటలకు, కొత్తవలస తెల్లవారుజామున 4.15 గంటలకు, పెందుర్తి 4.25 గంటలకు, దువ్వాడ ఉదయం 6.30 గంటలకు, అనకాపల్లి 6.43 గంటలకు, సామర్లకోట 7.58 గంటలకు, రాజమండ్రి ఉదయం 8.48 గంటలకు, ఏలూరు 10.18 గంటలకు, విజయవాడ 12.05 గంటలకు, తెనాలి 12.43న, చీరాల మధ్యాహ్నం 1.43 గంటలకు, ఒంగోలు 2.28 గంటలకు, నెల్లూరులో సాయంత్రం 4.33 గంటలకు, రేణిగుంటలో 7.10 గంటలకు, కుప్పంలో రాత్రి 11.43 గంటలకు హాల్ట్ ఉంటుంది.  
 

Advertisment
తాజా కథనాలు