Singareni: నైనీ టెండరు రద్దు.. ‘సింగరేణి’పై విచారణకు కమిటీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన నైనీ బొగ్గుగనుల టెండర్ల విషయం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం టెండర్లను రద్దు చేయడంతో కేంద్ర బొగ్గుశాఖ రంగంలోకి దిగింది. అసలు సింగరేణి సంస్థలో ఏం జరుగుతుందో తేల్చే పనిలో పడింది. విచారణకు కమిటీని నియమించింది.

New Update
singareni

Committee to investigate ‘Singareni’

Singareni: తెలంగాణలో సంచలనం సృష్టించిన నైనీ బొగ్గుగనుల టెండర్ల విషయం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం టెండర్లను రద్దు చేయడంతో కేంద్ర బొగ్గుశాఖ రంగంలోకి దిగింది. అసలు సింగరేణి సంస్థలో ఏం జరుగుతుందో తేల్చే పనిలో పడింది. ఒడిశాలోని నైనీ వద్ద బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ, ఆపరేటర్‌(ఎండీఓ) ఎంపిక కోసం 2025 నవంబరు 28న ప్రభుత్వం టెండరు ప్రకటన జారీ చేసింది. అయితే పలు కారణాలతో టెండర్లను రద్దు చేసింది. అసలు రద్దుకు దారితీసిన పరిస్థితులు ఏంటీ అనే కోణంలో కేంద్ర బొగ్గుశాఖ విచారణకు ఆదేశించింది. అంతేకాక సింగరేణిలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద నిధుల వినియోగం జరిగిన తీరుపై కేంద్రం  విచారణకు ఆదేశించడం గమనార్హం. దీనికోసం ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బొగ్గుశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌(డీడీజీ)గా పనిచేస్తున్న చేతన్‌ శుక్లా, సాంకేతిక విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న మారపల్లి వెంకటేశ్వర్లును విచారణ కమిటీ సభ్యులుగా నియమించింది. 

మూడు రోజుల్లో నివేదిక

కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా విచారణకు సంబంధిత ప్రతులు గురువారం సింగరేణి సంస్థకు చేరిన వెంటనే.. మధ్యాహ్నానికల్లా కమిటీ సభ్యులు ఢిల్లీ నుంచి వచ్చి విచారణ ప్రారంభించడం సంచలనంగా మారింది. అంతేకాక విచారణ నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర బొగ్గుశాఖ ఆదేశించడంతో ఆగమేఘాలపై కమిటీ సభ్యులు హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఉన్న సింగరేణి కార్యాలయానికి చేరుకున్నారు.  

హైదరాబాద్‌ కార్యాలయానికి కమిటీ

నిజానికి సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఉంది. కీలక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం పాలకమండలి సమావేశాలను హైదరాబాద్‌ కార్యాలయంలో నిర్వహిస్తుంటారు. అందుకే విచారణ కమిటీ హైదరాబాద్‌ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.కాగా, విచారణ కమిటీ రావడంతోనే అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించినట్లు తెలిసింది. నైనీతోపాటు సీఎస్‌ఆర్‌ నిధుల మంజూరు, వినియోగానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలను వెంటనే తమ ముందు పెట్టాలని సింగరేణి అధికారులను కమిటీ సభ్యులు ఆదేశించారు. దీంతో అధికారులు సంబంధిత పత్రాలతో పాటు, గతంలో నైనీ, సీఎస్‌ఆర్‌కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను కొత్తగూడెంతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సింగరేణి కార్యాలయాల నుంచి ఆగమేఘాలపై తెప్పించే పనిలో పడ్డారు. విచారణకు కేవలం 3 రోజుల సమయం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో సింగరేణి నుంచి సీఎస్‌ఆర్‌ నిధులను మంజూరు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా కమిటీ విచారణ చేయనుంది.

అసలేం జరిగిందో తేలాలి

 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాగా ఒడిశాలోని  నైనీలో బొగ్గు తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నైనీకి ఎండీఓ ఎంపికకోసం టెండర్‌లను పిలిచింది. అయితే పలు ఆరోపణల నేపథ్యంలో సింగరేణి వాటిని రద్దు చేసింది. అయితే ఆ  ప్రక్రియను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడానికే సాంకేతిక కమిటీని హైదరాబాద్‌కు బొగ్గుశాఖ పంపించినట్లు తెలుస్తోంది. టెండర్‌ దాఖలుకు గని సందర్శన(విజిట్‌) సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉండగా ఎందుకు ఇవ్వడం లేదని సింగరేణి అధికారులను కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం. కాగా సంబంధిత  సర్టిఫికెట్‌ ఇచ్చే అధికారం గని ప్రాంతంలో పనిచేస్తున్న జనరల్‌ మేనేజర్‌(జీఎం)కు ఉందని ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు కమిటీకి చెప్పారు. దీంతో జీఎం వివరణను కూడా కమిటీ సభ్యులు తెలుసుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ జారీ చేయకుండా కొంతమంది ఒత్తిడే కారణమని,  తద్వారా కొందరికి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నా రనే ఆరోపణలు వస్తున్నాయి...అదే సమయంలో దేశవ్యాప్తంగా కోల్‌ ఇండియా, మహానది కోల్‌ఫీల్డ్స్‌ వంటి అన్ని బొగ్గు కంపెనీల్లో ఇలాంటి నిబంధన ఉందా అనే వివరాలను కూడా సేకరించే పనిలో కమిటీ ఉంది.

కోర్టు ఏం చెప్పిందంటే...

నిజానికి గతంలో టెండరు ఇచ్చిన సమయంలో గని విజిట్‌ సర్టిఫికెట్‌ అనే నిబంధన లేదు. అయితే, ఒక గని పనులను ఇలాగే ఓ ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన సందర్భంలో ఆ సంస్థ పనులు సరిగా చేయలేదని ఆ కంపెనీపై చర్యలు తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ సంస్థ కోర్టుకు వెళ్లింది.... ఈ సందర్భంగా ముందుగా గనిని పూర్తిగా పరిశీలించని వారికి పనులెందుకు అప్పగించారనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిబంధనను టెండర్లలో పెట్టినట్లు సింగరేణి అధికారులు  కేంద్ర బొగ్గుశాఖకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎంతవరకు వాస్తవాలున్నాయి అని తేల్చే పనిలో కూడా కమిటీ విచారణ చేస్తోంది.

కమిటీ ముందు నాలుగు అంశాలు

కాగా, ప్రస్తుత ద్వీసభ్య కమిటీకి ఈ విషయంలో ప్రధానంగా నాలుగు అంశాలపై విచారణ చేయాలని బొగ్గుశాఖ సూచించింది. వాటిలో 1.నైనీ టెండర్ల ప్రక్రియను రద్దు చేయడానికి దారితీసిన కారణాలు ఏంటీ? 2. ఇతర బొగ్గు కంపెనీల్లో ఎండీఓ ఎంపికకు, వివిధ పనులను అప్పగించడానికి అనుసరిస్తున్న విధానాలను, సింగరేణితో పోల్చి చూసి... విచారించాలి.3.కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద సింగరేణిలో నిధుల వినియోగం ఎలా జరిగింది. నిబంధనల ప్రకారం ఎన్ని నిధులను ఎలా ఖర్చు చేశారో పరిశీలించాలి. 4. తక్షణమే సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి, విచారణ చేసి, మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలి.

Advertisment
తాజా కథనాలు