/rtv/media/media_files/2025/09/23/members-of-the-central-committee-of-the-maoist-party-2025-09-23-12-02-15.jpg)
Members of the Central Committee of the Maoist Party
ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు(maoists killed in chhattisgarh encounter) పార్టీకి చెందిన కేంద్ర కమిటీ(సీసీ) సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి (రాజుదాదా, వికల్ప్, ఉసెండీ) (63), కడారి సత్యనారాయణ రెడ్డి (కోసాదాదా, గోపన్న, బుచ్చన్న) (67) మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరిదీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కావడం గమనార్హం. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ సమసమాజ స్థాపనే లక్ష్యంగా మావోయిస్టు పార్టీలో చేరిన ఈ ఇద్దరు నేతలు ఒకే ఎన్‌కౌంటర్లో ఒకేసారి మరణించడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే పేర్కొనవచ్చు.
టీచర్ కొలువు వదిలి..చివరివరకు ఉద్యమంలోనే
ఉపాధ్యాయుడిగా ఉన్నత స్థానంలో ఉన్న కట్టా రామచంద్రారెడ్డి పీడిత ప్రజల కోసం టీచర్ కొలువు వదిలి చివరివరకు ఉద్యమంలో కొనసాగారు. రామచంద్రారెడ్డి కోహెడలో పది, సిద్దిపేటలో డిగ్రీ వరకు చదివి వరంగల్‌లో టీటీసీ పూర్తి చేశారు. తర్వాత పెంచికలపేట్‌లో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు.ఎందరో విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆయన సమాజంలోని అసమానతలను చక్కదిద్దడమే తన కర్తవ్యంగా భావించి అడవి బాట పట్టారు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలోనే గడిపి అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో అసువులు బాశారు. రాజు దాదా, గుడ్సా ఉసెండీ, విజయ్, వికల్ప్ తదితర పేర్లతో కొనసాగిన కట్టా రామచంద్రారెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి. ఆయన తల్లిదండ్రులు కట్టా వజ్రవ్వ, మల్లారెడ్డి. తండ్రి 97 ఏళ్ల వయసులో ఉండగా... తల్లి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. రామచంద్రారెడ్డి.. భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే శాంతి అనే మహిళను కులాంతర వివాహం చేసుకున్నారాయన. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితులైన ఆయన తన భార్యతో కలిసి అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఆయన న్యాయవిద్య అభ్యసించినట్లు తెలుస్తోంది.
న్యాయవిద్యపై ఆసక్తితో రాంచంద్రారెడ్డి నాందేడ్ వెళ్లినట్లు చెబుతారు. అక్కడ పీపుల్స్‌వార్‌గ్రూప్(పీడబ్ల్యూజీ)కు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తూ ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత తన భార్యతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ డెన్ కీపర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. అనంతరం దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) అధికార ప్రతినిధిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2020లో డీకేఎస్‌జడ్‌సీ బాధ్యతలను చేపట్టారు. ఆయన భార్య శాంతిప్రియను 2008 జనవరి 22న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమె... శిక్ష పూర్తి చేసుకొని మూడేళ్ల క్రితం ఆమె విడుదలయ్యారు. వారి కుమారుడు దంత వైద్యుడిగా, కుమార్తె సీఏగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. రామచంద్రారెడ్డి.. కొన్నేళ్ల క్రితమే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనపై ప్రభుత్వం రూ.40లక్షల రివార్డు ప్రకటించింది.
కార్మిక ఉద్యమం నుంచి కారడవిలోకి...
ఇక మావోయిస్టు పార్టీలో మరో కేంద్ర కమిటీ సభ్యుడు గా ఉన్న కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ గోపన్న అలియాస్ సాధు స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లి. ఆయన తల్లిదండ్రులు కడారి అన్నమ్మ, కృష్ణారెడ్డి. తండ్రి కిష్టారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అమ్మ అన్నమ్మ గృహిణి. వీరిద్దరూ పదేళ్ల క్రితమే మృతి చెందారు. 1955లో జన్మించిన సత్యనారాయణ ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత పెద్దపల్లిలో ఐటీఐ చదువుతుండగా(1975--77 మధ్య) ర్యాడికల్ విద్యార్థి ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. అనంతరం రామగుండంలోని కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌షిప్ చేశారు. అప్పుడు కర్మాగారంలో జరిగిన గొడవల్లో మేనేజర్ హత్యకు గురికాగా ఆయనను అరెస్ట్ చేశారు. విడుదలయిన అనంతరం ఆయన పీపుల్స్‌వార్ అనుబంధ సికాసలో కొంతకాలం పనిచేశారు అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. అదే సమయంలో మల్లోజుల కోటేశ్వర్‌రావు(కిషన్‌జీ) సూచనతో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. గెరిల్లా యుద్ధ నిపుణుడిగా పేరు పొందిన కోస... దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా, మిలిటరీ కమాండర్‌గా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. 1980లో ఉగాది పండుగ నాడు గోపాల్‌రావుపల్లికి వచ్చి కుటుంబ సభ్యులను కలిసిన కోస.. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే సమయంలో తన ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు అప్పట్లోనే తన ఫొటోలు, సర్టిఫికెట్లు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. పార్టీలో నే 1984లో రాధను వివాహం చేసుకున్నారు. కాగా సత్యనారాయణ రెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డి ఎంఇవోగా రిటైరయ్యారు. కాగా సత్యానారాయణ రెడ్డి తలపై మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.3 కోట్ల రివార్డును ప్రకటించాయి.
ఇది కూడా చూడండి: OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి సేల్.. ఫోన్లు, ట్యాబ్‌లు, బడ్స్‌పై జనాలు పిచ్చెక్కిపోయే ఆఫర్లు..!1