/rtv/media/media_files/2025/07/07/mahabubnagar-crime-news-2025-07-07-08-08-51.jpg)
Mahabubnagar crime news
TG Crime: మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూరీ తింటుండగా యువకుడి గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఖానాపూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల బ్యాగరి కుమార్ స్థానికంగా బాండ్ర గిరయ్యతో కలిసి తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి పొలాల్లో పని చేస్తున్నాడు. ప్రతి రోజూలానే ఆదివారం ఉదయం కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం రైతు రాంరెడ్డి పనివాళ్లకు భోజనం కోసం పూరీలు తీసుకువచ్చాడు.
ప్రాణం తీసిన పూరీ..
భోజన సమయంలో ఇద్దరూ కలిసి పూరీలు తింటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. కుమార్ తినే సమయంలో ఓ పూరీ ముక్క గొంతులో ఇరుక్కుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ అస్వస్థతకు గురయ్యాడు. పక్కనే ఉన్న గిరయ్య వెంటనే స్పందించి నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా కుమార్ కిందపడిపోయాడు. ఊపిరాడక తీవ్ర ఊపిరితిత్తుల ఇబ్బందులతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొద్ది క్షణాల్లోనే షాక్‌లా మారి పక్కనే ఉన్న వారందరినీ తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఇది కూడా చదవండి: భోజనం అవ్వగానే మిఠాయి తినాలనిపిస్తోందా? దానికి నిపుణులు చెప్పే పరిష్కారం తెలుసుకోండి
కుమార్ మృతిచెందిన విషయం గ్రామంలో తెలిసిన వెంటనే అతడి ఇంట్లో కన్నీరుమున్నేరుగా మారింది. కుమార్ కుటుంబంలో అతడు పెద్దదిక్కు కావడం, తండ్రిని చిన్నతనంలోనే కోల్పోవడంతో తల్లికి భరోసాగా నిలిచిన కుమారుడే ఈ విధంగా చనిపోవడం తల్లి రాజమణి, చెల్లెలు శైలజను శోకసంద్రంలో ముంచేసింది. మా ఇంటి దీపం ఆరిపోయింది.. ఇక మాకు దిక్కెవరు? అంటూ రోధించారు. గ్రామస్థులు కుటుంబానికి సంతాపం తెలిపారు. అకాల మరణం ఊహించని విషాదాన్ని తీసుకొచ్చింది. కుమార్ మృతితో ఖానాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇది కూడా చదవండి: వర్షం వల్ల వచ్చే తేమతో దురద, చెమట సమస్య! అయితే ఈ ఆకులను నీటిలో కలిపి స్నానం చేయండి
( ts-crime | ts-crime-news | crime news | Latest News | telugu-news)