/rtv/media/media_files/2025/11/30/sarpanch-elections-2025-11-30-10-56-07.jpg)
Sarpanch Panchayat Elections
Panchayat Elections : గ్రామాల్లో సర్పంచి ఎన్నిక(gram sarpanch elections in telangana)ల సందడి నెలకొంది.ఎవరినోట విన్న ఇదే మాట. కాగా, సర్పంచ్ పదవిని ఆశించి రిజర్వేషన్ల మూలంగా భంగపడిన వారు ఇప్పుడు ఉపసర్పంచ్ పదవికోసం ప్రయత్నిస్తున్నారు. దక్కని పదవి వదిలేసి దక్కెదైనా దక్కించుకోవాలని చూస్తు్న్నారు. దీంతో సర్పంచ్ పదవే కాదు.. ఉప సర్పంచ్ పోస్టుకు కూడా ఇప్పుడు ఫుల్​ డిమాండ్​ నడుస్తున్నది. సర్పంచ్ పదవి కోసం రిజర్వేషన్లు కలిసిరాని చోట ఆశావహులు వార్డు మెంబర్​గా పోటీ చేసి.. గెలిచి, ఉప సర్పంచ్​ పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతోపాటు ఉప సర్పంచ్‌కు కూడా ‘జాయింట్ చెక్ పవర్’ ఉండటమే దీనికి కారణం. అందుకే ఈ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. మేజర్ పంచాయతీల్లో ఆశావహులు వార్డు సభ్యుడిగా గెలిచి ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు ఎంతైకైనా రెడీ అంటున్నారు.
సర్పంచ్ పదవికి రూ.10 నుంచి రూ.20 లక్షలు పెట్టడానికి సిద్ధమైతే ఉపసర్పంచ్‌కు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. గతంలో పలుచోట్ల సర్పంచ్, ఉప సర్పంచ్​ మధ్య సమన్వయం లేకపోవడంతో గొడవలు జరిగాయి. ముఖ్యంగా చెక్ పవర్ విషయంలో ఇరువురికి పడక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఒకానొక దశలో ఉప సర్పంచ్​లకు చెక్​ పవర్​ రద్దు చేయాలంటూ సర్పంచ్​లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు సర్పంచ్‌గా గెలిచిన తర్వాత చెక్ పవర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తమ మాట వినేవారినే వార్డు సభ్యులుగా గెలిపించుకునేందుకు సొంతంగా ‘ప్యానల్స్’ ఏర్పాటు చేస్తు్న్నారు. అవసరమైతే వారి ఎన్నికల ఖర్చులూ భరించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. తమ ప్యానల్ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తూ.. ఉప సర్పంచ్ పదవి కూడా తమ వర్గం వారికే దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. - Local Body Elections 2025
Also Read : బీఎల్‌సంతోష్ వార్నింగ్.. దారికొచ్చిన ధర్మపురి
కొత్త ఎత్తుగడలు
పలుచోట్ల సర్పంచ్ కావాలనుకున్న నాయకులకు రిజర్వేషన్ మూలంగా పదవులు దక్కకపోవడంతో వారంతా ఉప సర్పంచ్ మీద కన్నేశారు. దీనికోసం పెద్ద ఎత్తున భేరాసారాలు సాగుతున్నాయి. సర్పంచి, వార్డు సభ్యుల ప్రచార ఖర్చులను భరించడం.. ముందే తమకు సరిపడా బలాన్ని ఏకగ్రీవం చేసుకోవడం వంటివి కొనసాగిస్తున్నారు. రిజర్వుడు పంచాయతీల్లో సర్పంచి అభ్యర్థుల ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే. ఇది ఉప సర్పంచి ఆశావహులకు కలిసి వస్తోంది. ‘వార్డు సభ్యుల గెలుపునకు ఖర్చులు పెట్టుకుంటాం. వార్డు పదవి మీకు.. ఉప సర్పంచి పదవి మాకు’ అనే షరతుతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో వార్డు సభ్యులు సైతం ఖర్చులు కలిసివస్తాయని ఒప్పేసుకుంటున్నారు.
మహిళలకు రిజర్వేషన్లు దక్కిన చోట కూడా వార్డు సభ్యులుగా గెలుపొందేందుకు ఏ వార్డు అనుకూలమో చూసుకుంటున్నారు. కొందరు రెండు, మూడు వార్డులకూ నామినేషన్ వేశారు. ఉపసంహరణ లోగా ఏ వార్డు ఆ వార్డులోని వారిని అనుకూలంగా మలచుకునేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. తర్వాత ఆ వార్డు నుంచే బరిలో నిలవనున్నారు. - revanth reddy sarpanch elections
Also Read : హారన్ మోగిస్తే ఇక అంతే సంగతులు.. సౌండ్ తగ్గితేనే గ్రీన్‌సిగ్నల్
ఎక్కడెక్కడంటే?
ఉదాహారణకు తీసుకుంటే కరీంనగర్ ఇల్లంతకుంట సర్పంచి ఎస్సీ జనరల్ అయింది. దీంతో ఇక్కడ 12 వార్డుల్లో ఏడుగురు వార్డు సభ్యులను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇదే మండలం కందికట్కూరులోనూ కుల సంఘాలను ఏకం చేసి తన బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ ఎస్సీ జనరల్. ఉప సర్పంచి పదవి ఆశించిన అభ్యర్థి గ్రామంలోని ఎనిమిది వార్డుల్లో అయిదు వార్డులను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక పోలింగ్ పూర్తవుడే ఆలస్యం ఉప సర్పంచి సీట్లో కూర్చునేందుకు సిద్ధమయ్యాడు.ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ నుంచి రాచర్ల బాకురుపల్లితండా కొత్త పంచాయతీగా ఏర్పడింది. ఈ రెండు పంచాయతీలు ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యాయి. సర్పంచి పదవిని ఆశించే ఇతర సామాజిక వర్గాలు నిరాశకు గురయ్యారు. ఉప సర్పంచి పదవి ఆశించేవారు రెండు గ్రామాల్లో తమ ప్యానెల్ వార్డు సభ్యులను గెలిపించుకునేందుకు ఒకొక్కరు రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
Follow Us