/rtv/media/media_files/2025/10/20/konda-couple-visits-cm-revanth-house-2025-10-20-20-37-33.jpg)
Konda couple visits CM Revanth's house
Big breaking : తెలంగాణలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నిన్నమొన్నటివరకు ముఖ్యమంత్రితో విభేదిస్తూ వచ్చిన కొండా సురేఖ దంపతులు సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లు కొండా దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఇటీవల తొలగించడం, ఆయన కోసం పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడం తదితర పరిణామాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వారు ఇటీవలి పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద కొద్ది రోజుల క్రితం హైడ్రామా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ విషయంలో జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం రాష్ర్టమంతా తెలిసింది. ఓఎస్డీ సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అతన్ని అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో ఉన్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రి నివాసం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని సుస్మిత విమర్శించారు. అంతేకాక రేవంత్ రెడ్డి సోదరులు భూ కబ్జాలు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది.
కొండా సురేఖ సైతం ఈ విషయమై రెడ్లు అంతా ఒక్కటై తమను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అంతకు ముందు మేడారం జాతర టెండర్ల విషయంలోనూ పొంగులేటి విషయంలో కొండా దంపతులు అధిష్టానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి సైతం కొండా సురేఖ హజరుకాలేదు. అయితే అంతకు ముందే ఆమె ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమై అన్ని విషయాలు చర్చించినట్లు తెలిసింది. కాగా, బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తూ బీసీ మంత్రిని ఇబ్బంది పెడుతున్నట్లు ప్రచారం సాగడంతో ఇతర మంత్రులు సైతం ఈ విషయమై రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మొత్తం మీదా ఈ విషయం పార్టీ హైకమాండ్ వద్దకు పోవడంతో జూబ్లీహిల్స్ ఎన్నికల దృష్ట్యా ఈ సమస్యను సమరస్యంగా పరిష్కారించాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్, ఉప ముఖ్యమంత్రిలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా దంపతులు, ముఖ్యమంత్రి మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు తాజాగా చేసిన వ్యాఖ్యలపై కొండా దంపతులు సీఎం రేవంత్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: తెలంగాణ, ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒల్లంతా బొబ్బలు.. భయం భయం!