/rtv/media/media_files/2025/02/12/EAUpTxPr4FJQNxhGRCmQ.webp)
Local Bodie Elections
TG BREAKING: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వంఅధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.9ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది. కాగా, మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్‌పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీవోలు ఖరారు చేశారు. గురువారం రాత్రే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్టు సమాచారం.
మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు ఛైర్‌పర్సన్ల ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. రేపు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!