TG Crime: పందులు తెచ్చిన పంచాయతీ.. స్పాట్‌లోనే ఐదుగురికి..

కల్వకుర్తిలో పందుల చోరీ ఘటన ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ వివాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

New Update
Kalvakurthi Crime News

Kalvakurthi Crime News

TG Crime: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పందుల పంచాయితీ ఒకరి ప్రాణం తీసింది. చోరీకి గురైన పందుల విషయంలో తలెత్తిన పంచాయితీ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి చనిపోయే వరకు వివాదం వెళ్లింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్‌కు చెందిన బెల్లంకొండ రాములు (45), కొర్రెడ్డి నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేష్ సహా మరికొందరు పందులను పెంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరి పందులు చోరీకి గురయ్యాయి. అయితే.. చోరీకి గురైన పందులు వెల్దండ మండలం పోతేపల్లికి వెళ్లే దారిలో ఉన్నాయని వీరికి సమాచారం అందింది. 

దీంతో వీరు పందులను వెతుక్కుంటూ అక్కడికి వెళ్లారు. అక్కడ స్థానికంగా ఉన్న ఓ షెడ్ లో వీరికి చోరికి గురైన పందులు కనిపించాయి. ఈ విషయంపై ఆరా తీస్తున్న క్రమంలో మానపాటి వెంకటమ్మ, పవన్‌కుమార్, శివ, అన్వేశ్, దుద్రాక్షల కృష్ణ అనే వ్యక్తులు వీరిపై కర్రలు, కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: తండ్రికొడకుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఎస్సైని దారుణంగా నరికి చంపారు!

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన వారికి అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పందుల చోరీపై కల్వకుర్తి, వెల్దండ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదు చేశామని బాధితులు చెబుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘర్షణ జరిగకపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కల్వకుర్తి సీఐ నాగార్జున ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అన్యమతస్థుడితో అక్రమ సంబంధం.. వివాహితను గుండు గీయించి ఊరేగించారు!

Advertisment
తాజా కథనాలు