Hydra: అర్థరాత్రి ప్రాణాలకు తెగించి.. మొసళ్ల నుంచి 9 మంది కార్మికులను కాపాడిన హైడ్రా టీం!

హైదరాబాద్‌లోని మీర్ ఆలం చెరువులో చోటుచేసుకున్న ఒక భయానక ఘటనలో HYDRA డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సాహసాన్ని ప్రదర్శించారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ప్రాణాలకు తెగించి 9 మంది కార్మికులను సురక్షితంగా రక్షించి 'రియల్ హీరోలు' అనిపించుకున్నారు.

New Update
Hyderabad HYDRA

హైదరాబాద్ నగరంలో ఆపదలో ఉన్నవారికి 'హైడ్రా' ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మీర్ ఆలం రిజర్వాయర్(Mir Alam reservoir) సమీపంలో నిర్మిస్తున్న వంతెన పనుల కోసం మట్టి నమూనాల పరీక్ష నిర్వహించేందుకు తొమ్మిది మంది కార్మికులు పడవపై చెరువు మధ్యలోకి వెళ్లారు. అయితే, పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా పడవ ఇంజిన్ మొరాయించింది. అప్పటికే చీకటి పడటం, చుట్టూ దట్టమైన నాచు,  మీర్ ఆలం చెరువులో ప్రమాదకరమైన మొసళ్ళు(saved from crocodile) ఉండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చీకటిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కార్మికులు తమ సెల్‌ఫోన్ టార్చ్ లైట్లను ఊపుతూ సాయం కోసం కేకలు వేశారు. వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించగా, వారు హైడ్రా DRF కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేశారు.

Also Read :  TG TET 2026: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇక ఆ ప్రాసెస్ కు బ్రేక్!

Also Read :  బాంబు పెట్టి లేపేస్తాం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ!

హైడ్రా DRF సాహసం

సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు, DRF బృందం అర్ధరాత్రి సమయంలో ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. ఆ రిజర్వాయర్‌లో ప్రమాదకరమైన మొసళ్లు ఉన్నాయి. చెరువులో పెరిగిన గుర్రపుడెక్క, దట్టమైన గడ్డి కారణంగా బోటు ముందు వెళ్లడం లేదు. చిమ్మచీకటిలో కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించడం కష్టతరమైంది.

అయినప్పటికీ, DRF(HYDRA DRF) సిబ్బంది కార్మికులకు ఫోన్‌లో ధైర్యం చెబుతూ, రెండు విడతలుగా బోట్లలో వెళ్లి వారిని సురక్షితంగా రక్షించారు. గాలిలో టార్చ్ లైట్ల సహాయంతో దారిని వెతుక్కుంటూ, ప్రాణాలకు తెగించి వారిని నెహ్రూ జూలాజికల్ పార్క్ తీరానికి చేర్చారు. మృత్యువు అంచున ఉన్న తమను కాపాడినందుకు కార్మికులు హైడ్రా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. "అర్ధరాత్రి వేళ మాకు ప్రాణభిక్ష పెట్టిన హైడ్రా సిబ్బంది నిజమైన హీరోలు" అంటూ కొనియాడారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన DRF బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. 

Advertisment
తాజా కథనాలు