/rtv/media/media_files/2025/09/18/cyber-criminals-2025-09-18-08-03-12.jpg)
Cyber criminals
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని 76 ఏళ్ల రిటైర్డ్ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. మోసపోయినందుకు తీవ్ర మానసిక వేదనకు గురై ఆమె గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల మరణించిన ఆ డాక్టర్ ఫోన్‌ను కుటుంబ సభ్యులు పరిశీలించగా.. కొన్ని విషయాలు బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు చాలాసార్లు వీడియో కాల్స్ చేసినట్లు గుర్తించారు. వారి మాటలు నమ్మి ఆమె తన ఖాతాల నుంచి రూ. 6.6 లక్షలను వారు చెప్పిన అకౌంట్‌కు బదిలీ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ మానసిక క్షోభ వల్లే ఆమెకు గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల వేధింపుల వల్లే..
దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి ఫోన్‌లోని కాల్ డేటా, డబ్బు బదిలీ అయిన బ్యాంక్ ఖాతాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా సైబర్ నేరగాళ్ల వేధింపుల వల్లే ఆమె మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు రూ. 6.6 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ తరహా మోసాల పట్ల వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత మరియు ఆర్థిక వివరాలను ఎప్పుడూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియో.. నడిరోడ్డుపై భర్త కాలర్ పట్టుకుని చితకబాదిన భార్య