/rtv/media/media_files/2026/02/09/online-gameing-scam-2026-02-09-15-56-27.jpg)
online gameing scam
Online Gaming Scam : నగరంలో భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. టెక్నాలజీ ముసుగులో సాగుతున్న ఈ భారీ ఆన్‌లైన్ గేమింగ్ దందా గుట్టును డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) హైదరాబాద్ జోన్ అధికారులు రట్టు చేయడం సంచలనంగా మారింది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. చిన్న సమాచారంతో మొదలైన విచారణ ఏకంగా రూ. 5,000 కోట్ల భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేయడం గమనార్హం. దుబాయ్ కేంద్రంగా ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కంపెనీ ద్వారా డొల్ల కంపెనీలకు రూ.5వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించారు. ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు, రెంటెడ్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. జీఎస్టీ ఎగవేతకు ఎస్క్రో ఖాతాలను దుర్వినియోగం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఫిన్‌టెక్ సంస్థలు, రేస్‌జీ-ఈటీ247 వంటి వెబ్‌సైట్ల ద్వారా అక్రమ దందా నడిచినట్లు బయటపడింది.
కాగా దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల టర్నోవర్ నడిపిస్తూ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీని ఎగ్గొడుతున్న ఈ అంతర్రాష్ట్ర సిండికేట్‌పై హైదరాబాద్ జోన్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడంతో విషయం బయటకు వచ్చింది. పక్కా సమాచారంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడులు దేశవ్యాప్తంగా కార్పొరేట్, గేమింగ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ భారీ స్కామ్ వెనుక ముంబైకి చెందిన వై.ఎస్. ప్రభు కుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
గత కొన్నేళ్లుగా నిందితులు ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా బెట్టింగ్‌లు, గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. తద్వారా ప్రభుత్వ కళ్లుగప్పి అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్లు తేలింది. వీరు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించడం, విదేశీ సర్వర్ల ద్వారా లావాదేవీలు జరపడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం. ముంబై, ఢిల్లీలో ఆఫీసులు తెరిచి, హైదరాబాద్ కేంద్రంగా ఆపరేషన్స్ నడిపిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరి నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందంటే.. అనేక షెల్ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలను మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా ఈ తనిఖీల్లో లభించిన హార్డ్ డిస్క్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ల ఆధారంగా జీఎస్టీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేవలం పన్ను ఎగవేతే కాకుండా.. ఈ వ్యవహారంలో హవాలా కోణం కూడా ఉందా? అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. రూ. 5,000 కోట్ల లావాదేవీల్లో ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ వాటా ఎంత? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే విషయాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుల అరెస్టుతో పాటు వారికి సహకరించిన మరికొంతమంది పేర్లు కూడా త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకింగ్ ఏపీఐలను అక్రమంగా ఉపయోగించి, ఆడిట్‌కు దొరక్కుండా నిందితులు జాగ్రత్త పడ్డారని పోలీసులు వివరించారు. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారీ మొత్తాలు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు విచారణలో వెల్లడైంది. ఈ స్కామ్‌లో కీలక నిందితులుగా ఉన్న 'విగోఫిన్ డిజిటల్ సొల్యూషన్స్' డైరెక్టర్లు వైఎస్ ప్రభుకుమార్, రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో ఈ స్కామ్‌కు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆన్‌లైన్ గేమింగ్‌కు జీఎస్టీ ఇలా?
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆన్‌లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్, క్యాసినోలపై పన్ను నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. తాజా నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్ గేమ్స్‌లో యూజర్లు పందెం కాసే లేదా డిపాజిట్ చేసే పూర్తి మొత్తంపై 28 శాతం జీఎస్టీ చెల్లించడం తప్పనిసరి చేసింది. ఉదాహర ణకు ఒక యూజర్ రూ. 1,000 పెట్టి చిప్స్ కొన్నా లేదా వాలెట్‌లో యాడ్ చేసినా.. ఆ మొత్తంపై కంపెనీ 28 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇది ‘గేమ్ ఆఫ్ స్కిల్’ అయినా, ‘గేమ్ ఆఫ్ చాన్స్’ అయినా సరే.. పన్ను వర్తిస్తుంది. కానీ ఈ ముఠా.. తమది కేవలం ప్లాట్‌ఫామ్ సర్వీస్ అని చెప్పుకుంటూ, లేదా విదేశీ యాప్స్ అని మభ్యపెడుతూ ఈ 28% భారీ పన్నును ఎగవేసినట్లు తెలుస్తోంది. కేవలం నామమాత్రపు పన్ను కట్టడం లేదా అసలు రిజిస్ట్రేషన్ లేకుండానే డొల్ల కంపెనీల ద్వారా వేల కోట్లు వెనకేసుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
Follow Us