/rtv/media/media_files/2025/04/18/5GIa6H9ferlXN00vuuDn.jpg)
Heavy rains for two days in Telangana
Rains alert : తెలంగాణ రాష్ట్రం లో గడచిన వారం రోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొన్నది. ఉదయమంతా వాతావరణం ఎండతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకుంటున్నాయి. సాయంత్రం అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రోడ్లన్ని జలమయమై రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. అయితే ఈ వాతావరణం మరో రెండు రోజులు ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
పొద్దంతా తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రానికి వానలు పడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40-44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సాయంత్రం వానలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లబడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో 43.4, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, ఇల్లంతకుంట, నిజామాబాద్ జిల్లాలో 42.3 డిగ్రీలు నమోదైంది. కాగా మరో రెండు రోజులు ఇదే వాతావరణం ఉండనుందని, కనుక బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని అధికారులు తెలుపుతున్నారు.
Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!
జనగామ జిల్లా నర్మెట మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆగపేట, గండిరామవరం, వెల్దండ, అమ్మాపురం, మచ్చుపహడ్, హన్మంతాపూర్, బొమ్మకూరు తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. విద్యుత్తు తీగలు, స్తంభాలపై చెట్లు విరిగిపడి కొన్నిచోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలాచోట్ల కోతకు వచ్చిన వరిపంట నేలవాలి ధాన్యం రాలిపోయింది.వెల్దండలోని ఓ కొనుగోలు కేంద్రంలో క్వింటాళ్ల కొద్ది ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడుతున్నాయి.
Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!