Group-2 Results: త్వరలో గ్రూప్‌-2 ఫలితాల వెల్లడి..ఎప్పుడంటే?

రాష్ట్రంలో టీజీపీఎస్సీ నిర్వహించిన  గ్రూప్‌-2 సర్వీసు పోస్టులకోసం నిర్వహించిన పరీక్షల  తుది ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ మేరకు వీలయినంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది.

New Update
TGPSC

Telangana Public Service Commission

Group-2 Results: తెలంగాణ రాష్ట్రంలో  టీజీపీఎస్సీ నిర్వహించిన  గ్రూప్‌-2 సర్వీసు పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల  తుది ఫలితాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ మేరకు  వీలయినంత త్వరగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కమిషన్‌ ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది...మరో వైపు అభ్యర్థుల అర్హతలు, ఇచ్చిన ఆప్షన్లు ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకున్న టీజీపీఎస్సీ తుది జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మూడు నెలల క్రితమే ఈ ఫలితాలను వెల్లడించాలని కమిషన్‌ భావించినప్పటికీ గ్రూప్‌-1పై న్యాయవివాదాలు తలెత్తడంతో  ఆలస్యమవుతోంది. గ్రూప్‌-2 కోసం టీజీపీఎస్సీ 783 పోస్టులతో నోటిఫికేషన్‌ జారీచేసింది.  దీనికోసం మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేయగా... 2024 డిసెంబరులో రాత పరీక్షలు నిర్వహించారు. ఈ  పరీక్షలకు 2,49,964 మంది హాజరయ్యారు. ఇందులో ఓఎంఆర్‌ పత్రాల్లో పొరపాట్లు, బబ్లింగ్‌ సరిగా చేయకపోవడం తదితర కారణాలతో 13,315 మంది అభ్యర్థులను కమిషన్‌ అనర్హులుగా వెల్లడించింది. మిగతా 2,36,649 మందికి వచ్చిన మార్కులన్నింటితో కలిపి జనరల్‌ ర్యాంకు జాబితాను ఈ ఏడాది మార్చి 11న ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసిన కమిషన్‌ మూడు దఫాలుగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసింది. తొలి రెండు విడతల్లో పరిశీలన పూర్తయింది. ఆ  తర్వాత సరైన అభ్యర్థులు అందుబాటులో లేక మిగిలిపోయిన పోస్టులకు తదుపరి మెరిట్‌ జాబితా నుంచి మూడో దఫా పరిశీలనకు కమిషన్‌ పిలిచింది. వీరికి ఈ నెల 13 నుంచి 15 వరకు పరిశీలన పూర్తి చేసింది.  ఇప్పటికే కొన్ని పోస్టులకు అవసరమైన వైద్యపరీక్షలు కూడా పూర్తి చేసింది.

గ్రూప్‌-3 కూడా..
మరో వైపు 2024 నవంబర్‌ లో గ్రూప్‌-3 సర్వీసుల కింద 1,388 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలకు.. 2,67,921 మంది హాజరయ్యారు. అందులో సాంకేతిక కారణాలతో 18,364 మందిని కమిషన్‌ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,49,557 మంది అభ్యర్థులతో 14న జీఆర్‌ఎల్‌ను  వెల్లడించింది. మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులకు జూన్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించేందుకు కమిషన్‌  ఇప్పటికే షెడ్యూలు ప్రకటించింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో  తిరిగి వాయిదా వేసింది. గ్రూప్‌-2 తుది ఫలితాల వెల్లడికి పరిపాలన ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్‌-3 కింద ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టేందుకు కార్యాచరణను కమిషన్‌ రూపొందించేందుకు సిద్ధమైంది.

గ్రూపు 1 రద్దు

కాగా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల్లో... టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను ఇచ్చింది. ‘‘మెయిన్స్‌ జవాబు పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలి. సంజయ్‌సింగ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్‌(సాధారణ పద్ధతి)గా మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలని సూచించింది. లేదంటే... 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్‌ను రద్దు చేసి,  తిరిగి పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి’’ అని హైకోర్టు స్పష్టంచేసింది. గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు, వాటిని రద్దు చేయరాదంటూ మరికొందరు దాఖలు చేసిన 12 పిటిషన్‌లపై విచారించిన జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం 222 పేజీల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

Advertisment
తాజా కథనాలు