/rtv/media/media_files/2025/02/02/ATyh21QPhtLroOVlaDDk.jpg)
Family Survey Telangana
Family Survey : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన తుది నివేదికను ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేని నిర్వహించింది. రాష్ట్రంలో 1.16 కోట్ల కుటుంబాలను సర్వేలో గుర్తించామని, దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సేకరించామని ప్రణాళిక విభాగం అధికారులు సీఎంకి వివరించారు.
Also Read : సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసులకు దొరికిన బిగ్ ప్రూఫ్
తెలంగాణ ఏర్పాటైన మొదట్లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే చేపట్టింది. నాటి సర్వే ప్రకారం బీసీలు 51శాతం, ఓసీలు 21, ఎస్సీలు 18, ఎస్టీలు 10 శాతం ఉన్నట్టు తేలింది. కానీ, ఈ సర్వేను అధికారికంగా విడుదల చేయలేదు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కులం, మతం సహా అన్ని వివరాలను సేకరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలనే అంశంపై ప్రభుత్వం ఈ సర్వేను వినియోగించుకోనుంది. అయితే తాజా సర్వేలో ఆసక్తికర విషమాలు వెలుగు చూశాయి. గతంతో పోలిస్తే ఈ సర్వేలో బీసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుత సర్వేలో బీసీలు 55.85 శాతంగా తేలారు. ఇందులో 42 శాతం హిందూ బీసీలు కాగా.. 13.85 శాతం మైనారిటీ, ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు.
Also Read: Guntur: కేఎల్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై సీబీఐ కేసు
సుమారు 1500 పేజీలతో రూపొందించిన సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేయనున్నారు. ఆ నివేదికపై ఉపసంఘం అధ్యయనం చేయనుంది. 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీల రిజర్వేషన్లపై ఒక తీర్మానం చేసి.. దాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
Also Read: GST: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కారు బీసీ కమిషన్‌తో పాటు, ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిషన్ కూడా బీసీల రిజర్వేషన్లపై లోతుగా అధ్యయనం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిసింది. సర్వే వివరాలు, ప్రత్యేక కమిషన్ సూచనలను పరిగణనలోకి తీసుకొని.. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. కాగా, మార్చి 20 నాటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిశగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ చేపడుతోంది. కుల సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరనుండడంతో ఎన్నికల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.