/rtv/media/media_files/2025/10/06/jubilee-hills-by-election-2025-10-06-16-53-26.jpg)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల(jubilee hills by‑elections) షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్(ec) విడుదల చేసింది. ఈ ఎన్నికను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. 14న కౌంటింగ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 21. నామినేషన్ల పరిశీలనకు ఆఖరి తేదీ 22. విత్ డ్రా చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఈ నెల 24. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ రోజు బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసన సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూళ్లను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది.
బ్రేకింగ్ న్యూస్
— Volga Times (@Volganews_) October 6, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
నవంబర్ 11వ తేదీ పోలింగ్, 14వ తేదీ కౌంటింగ్#JubileeHillsByPoll#LatestNewspic.twitter.com/7GRF7Uoeng
Also Read : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్, బొంతు, CN రెడ్డి.. వారి బలాలు, బలహీనతలు ఇవే!
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే.. అనారోగ్య కారణాలతో జూన్ 8న ఆయన కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి సునీతను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించి.. ప్రచారం కూడా ప్రారంభించింది. అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్ కు పంపింది. ఈ ముగ్గురిలో ఒకరిని హైకమాండ్ ఒకటి లేదా రెండు రోజుల్లో ఫైనల్ చేయనుంది.
రాష్ట్రంలో మరో ప్రధానమైన పార్టీ బీజేపీ కూడా గెలుపే లక్ష్యంగా అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. 2023 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగి మూడో స్థానానికి పరిమితమైన లంకల దీపక్ రెడ్డి పేరుపై ప్రధానంగా చర్చ సాగుతోంది. అయితే.. ఆయనకు ఈ సారి ఛాన్స్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. వీరపనేని పద్మ, జూటూరు కీర్తిరెడ్డి పేర్లను ఆ పార్టీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేపు జరిగే ఆ పార్టీ ఎన్నికల కమిటీలో అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ప్రధాన పార్టీలకు ఛాలెంజ్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. సొంత సీటును నిలబెట్టుకుని, వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని చాటాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ సీటులో విజయఢంకా మోగించి.. రాష్ట్రంలో తమకు తిరుగులేదని, తమ బలం మరింత పెరిగిందని చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ మంచి ఫలితాలు సాధించి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవాలని బీజేపీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.
Also Read : తెలంగాణలో మరో దారుణం.. అలా చేస్తోందని అత్తను కొట్టి చంపిన కోడలు!