/rtv/media/media_files/2025/09/26/congress-mla-letter-to-world-bank-2025-09-26-19-14-12.jpg)
Congress MLA's letter to World Bank asking for Rs. 100 crores
TG Politics: తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వీడడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పై ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తుండగా మరొకొంతమంది పరోక్షంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై సొంతపార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా వర్షాల కారణంగా తన నియోజకవర్గం దెబ్బతిందని దానికి నిధులు ఇవ్వాలని కోరుతూ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి కాకుండా ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం సంచలనంగా మారింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈ మేరకు తన నియోజకవర్గంలో వర్షాల వల్ల జరిగిన నష్టానికి రూ.100 కోట్ల పరిహారం ఇవ్వాలని నేరుగా వరల్డ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా వరల్డ్ బ్యాంక్‌కు లేఖ రాయడంపై చర్చ మొదలైంది.ఈ లేఖతో సొంత ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పరోక్షంగా తెలిపినట్టేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి వరల్డ్ బ్యాంక్ ప్రభుత్వాల నుండి వినతులు స్వీకరిస్తుండే కానీ, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు తీసుకోదు. అయితే ఒక ఎమ్మెల్యేస్థాయి వ్యక్తి కనీసం అవగాహన లేకుండా ఇలా లేఖ రాయడం ఏమిటని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.
ఆయన లేఖ సారాశం....
గత 100 సంవత్సరాలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు మరియు వరదలు ప్రజల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. అనేక గ్రామాలు ముంపుకు గురై పంటలు నాశనం కాగా, వందలాది ఇళ్లు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమై గ్రామాల మధ్య రవాణా సౌకర్యం దెబ్బతింది. తాగునీటి వనరులు చెడిపోయి, విద్యాసంస్థలు కూడా నష్టపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ (GFDRR) కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పునరావాసం, పునర్నిర్మాణం, భవిష్యత్ విపత్తులకు సన్నద్ధత కోసం కనీసం ₹100 కోట్ల విపత్తు సహాయ నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఈ నిధులను కింది రంగాల పునరుద్ధరణకు వినియోగించాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్ ముందుంచారు.
రైతులు: వరదల కారణంగా నష్టపోయిన పంటలకు తక్షణ సహాయం అందించడం.
గృహాలు: కూలిపోయిన, ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణం, ముఖ్యంగా పేద మరియు బలహీన వర్గాలకు సహాయం.
తాగునీటి వనరులు: పబ్లిక్ వాటర్ ట్యాంకులు, పైపులైన్ వ్యవస్థ పునరుద్ధరణ, శుద్ధి చేసిన నీటి అందుబాటు.
విద్యా రంగం: వరదలతో దెబ్బతిన్న పాఠశాలలు మరమ్మత్తు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పన.
రోడ్లు మరియు మౌలిక వసతులు: దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణం, గ్రామాల మధ్య రవాణా సౌకర్యం పునరుద్ధరణ.
ప్రజల జీవితాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చే క్రమంలో, అలాగే దీర్ఘకాలిక రక్షణ చర్యల కోసం ఈ సహాయం అత్యవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. ఎల్లారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన విపత్తు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తక్షణ సహాయం అందించాలి. ఈ నిధుల ద్వారా పునరావాసం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనే స్థిరమైన వసతులను నిర్మించే అవకాశం కలుగుతుంది అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!