మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. స్వామి దేవాలయానికి దగ్గర్లో రూ.110కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కురుమూర్తి ఆలయానికి వచ్చిన సీఎంకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
'' పేదల తిరుపతిగా కురుమూర్తి స్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు అంచనాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా కూడా వలసలు కొనసాగుతున్నాయి.
Also Read: కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
నారాయణ్‌పేట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తాం. మా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. నాపై కోపం ఉంటే రాజకీయంగా నాపై కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు. అలా చేస్తే పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు. నేను ఎక్కడ ఉన్నా.. ఈ జిల్లా అభివృద్దిని కాంక్షించేవాడినే.
Also Read: ప్రియుడితో పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, కారణం తెలిస్తే !
జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనున్నాం. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా ఇక్కడి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మాది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ వేదికగా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తాం. కాళ్లల్లో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించరని'' సీఎం రేవంత్ అన్నారు.