/rtv/media/media_files/2025/04/17/e7iqWjQO6UscBvhfOJ90.jpg)
Cm Revanth Reddy investment agreements
సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ రెడీ అయింది. జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1000
కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. దీని ద్వారా 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది .
జపాన్ నుంచి రూ.5 వేల కోట్ల పెట్టుబడులు..
తెలంగాణలోని హైదరాబాద్ లో అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీలో భాగంగా జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే అంచనాలున్నాయి. మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై దృష్టి పెట్టనుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడుతారు. తెలంగాణ, హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతకు మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ దై సకాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. అక్కడున్న అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామని అన్నారు.
మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ మరియు మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను నియమించింది.
today-latest-news-in-telugu | telangna | cm-revanth-reddy | japan
Also Read: Gold: లక్షకు చేరువలో బంగారం.. ధర తగ్గే ఛాన్స్ ఉందా? కొనేందుకు ఇది సరైన సమయమేనా?