/rtv/media/media_files/2025/07/31/defector-mlas-2025-07-31-19-37-15.jpg)
Defector MLAs
By-elections in Telangana: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పార్టీల దృష్టి ఉప ఎన్నికల వైపు మళ్లీంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం తమకంటే తమకు అనుకూలమని ప్రకటించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీవివేకానంద, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనాసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ తీర్పుపై అన్ని పార్టీలు ఎవరికీ అనుకూలంగా వారు స్పందిస్తున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా కాపాడినందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
Also Read : పార్టీ ఫిరాయించిన MLAలకు 3 నెలలే డెడ్‌లైన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో రాహుల్ గాంధీని హరీష్ రావు నిలదీశారు. గురువారం ఎక్స్ ఖాతా ద్వారా హారీశ్ రావు ట్వీట్ చేశారు. చేతిలో రాజ్యాంగం పట్టుకునేది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా రాహుల్ గాంధీ? అంటూ ఆయన ప్రశ్నించారు. మీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఇస్తావా ? అని హరీష్ రావు నిలదీశారు. నువ్వు చేతిలో పట్టుకొని తిరిగే రాజ్యాంగ విలువలు పాటిస్తావా? లేదా అంటూ రాహుల్ గాంధీకి ట్వీట్ గ్యాగ్ చేశారు.
Also Read : తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు
కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, కాలె యాదయ్యా, ప్రకాశ్ గౌడ్, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోకపోవడంతో సుప్రీం గడప తొక్కింది బీఆర్ఎస్. దీంతో ఈ రోజు తీర్పు వెలువడింది. అయితే దీంతో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం తప్ప మరో మార్గం లేదా? అనేది ఆసక్తిగా మారింది. అయితే స్పీకర్ అధికార పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకుంటే మనో మూడు నెలల్లో ఈ పది స్థానాలకు ఉప ఎన్నిక ఖాయమని తెలుస్తోంది.
గోషామహల్, జూబ్లీహిల్స్ తో పాటు ...
ఒకవేళ పది స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే రాష్ట్రంలో మరో రెండు స్థానాలను కలుపుకుని మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిలో జూబ్లీహిల్స్ ఒకటి. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆ నియోజక వర్గానికి ఆరునెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మరో వైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ కి రాజీనామా చేశారు. అదే సమయంలో ఆయనను పార్టీ కనుక రాజీనామా చేయాలని కోరితే ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే అక్కడ ఉప ఎన్నిక తప్పదు. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు తప్పవు. దీంతో భద్రాచలం (తెల్లం వెంకట్రావు) ,బాన్సువాడ (పోచారం శ్రీనివాస్ రెడ్డి), ఖైరతాబాద్ (దానం నాగేందర్), పటాన్ చెరు (గూడెం మహిపాల్ రెడ్డి), శేర్ లింగంపల్లి (అరికపూడి గాంధీ), గద్వాల్ (బండ్ల కృష్ణమోహన్ రెడ్డి), జగిత్యాల (డా.సంజయ్), చేవెళ్ళ (కాలె యాదయ్యా,), రాజేంద్రనగర్ ( ప్రకాశ్ గౌడ్). ఘన్‌పూర్ (స్టేషన్) (కడియం శ్రీహరి) నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పకపోవచ్చు.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
స్పీకర్ నిర్ణయమే ఫైనల్..
అయితే స్పీకర్ కు సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ ఆయనక వర్తించదని, స్పీకర్ ముందు దాఖలైన పిటిషన్ ల పరిష్కారానిక కాలపరిమితి ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గత ప్రభుత్వంలోనూ ఇలాగే జరిగింది. అయితే నాడు ఎమ్మెల్యేలంతా పార్టీలో చేరడంతో ఆ పార్టీ విలీనం అయినట్లు ప్రకటించడంతో అనర్హత విషయం అంత చర్చకు దారితీయలేదు. అయితే ప్రస్తుతం కేవలం పదిమంది మాత్రమే పార్టీమారడంతో అనర్హత విషయం రచ్చరచ్చగా మారింది. అంతేకాక 2022లో మహారాష్ట్రలో శివసేన రెండు వర్గాలుగా చీలింది. అందులో శివసేన(ఉద్ధవ్ థాక్రే), శివసేన (ఏక్ నాథ్ షిండే) వర్గాల మధ్య సాగిన గొడవ సుప్రీం కోర్టుకు చేరింది. ఈ విషయంలోనూ సుప్రీం తీర్పు ను స్పీకర్ అమలు చేయలేదు. దాన్నే తెలంగాణ స్పీకర్ అనుచరిస్తారా? లేక తుది నిర్ణయం తీసుకుంటారా అనేది మూడు నెలల్లో తేలనుంది.
రాజీనామాలు చేయాల్సిందే (నా)
మరోవైపు అనర్హత వేటు పడకుండాఉండేందుకు కాంగ్రెస్ మరో వ్యూహం పన్నుతుందన్న ప్రచారం లేకపోలేదు. అనర్హత కేసు ఉన్న పదిమందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తప్పకుండా వేటు పడే అవకాశం కనిపిస్తుంది. దీనికి కారణం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనపై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోపు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద తిరిగి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తాజా తీర్పుతో మిగిలిన 9 స్థానాలకు కూడా రాజీనామా చేయాల్సి వస్తే తిరిగి ఆ స్థానాలను గెలవగలమా లేదా అనే సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే సమయంలో స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి అనర్హత నిర్ణయాన్ని వాయిదా వేయించడమే ఉత్తమమని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తం మీద సుప్రీం కోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి. ఎన్నికలా? లేక ఇప్పుడున్న పరిస్థితే కొనసాగుతుందా? అనేది మూడునెలల్లో తేలనుంది.
ఇది కూడా చదవండి:BIG BREAKING: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!