BIG BREAKING: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!

నెల్లూరులో ఈ రోజు జగన్ చేపట్టిన టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో హైటెన్షన్ నెలకొంది.

New Update
YS Jagan Nellore Tour

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్  ఈ రోజు తలపెట్టిన నెల్లూరు టూర్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగన్‌కు స్వాగతం పలికేందుకు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులతో కలిసి నల్లపురెడ్డి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. ఎస్పీ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. తమ అధినేత జగన్‌ను ఇంటికి తీసుకెళ్లే వరకు ఆందోళన ఆపేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెన్నై- కోల్‌కతా హైవేలో సైతం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. 113 మందికి మించితే కేసులు పెట్టి అరెస్టు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్యాసింజర్ వాహనాలను సైతం తనిఖీ చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మాజీ మంత్రుల వరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ముఖ్యంగా ఇటీవల పలు వివాదాలకు కేంద్ర బింధువుగా మారిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. జగన్ ఆయన ఇంటికి వెళ్లనున్న నేపథ్యంలో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నెల్లూరు పట్టణంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు మాత్రం తాము పోలీసుల ఆంక్షలను పట్టించుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా జగన్ దగ్గరకు వెళ్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. 

నెల్లూరులో పర్యటిస్తున్న వైఎస్ జగన్ జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు. క్వార్జ్ అక్రమ రవాణా, తవ్వకాలు, నిబంధనల ఉల్లంఘన తదితర అభియోగాలతో కాకాణి గోవార్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలులో ఉన్నారు.

అయితే.. కూటమి ప్రభుత్వం ఆయనను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన ఇంటిపై ఇటీవల దాడి జరిగింది. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది. ఈ క్రమంలోనే జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు.

Advertisment
తాజా కథనాలు