/rtv/media/media_files/2025/03/07/t0CyBXyTveNDRJKpsnMN.jpg)
kcr-meet-brs-leaders
KCR Key Meeting : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆవిర్భావ రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఅర్ఎస్ నేతలతో కేసీఅర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలు, బహిరంగ సభల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
కాగా బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఏడాదంతా నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించింది. ఈ వేడుకల సందర్భంగా భారీ బహింరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఉంటుంది. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్‌లో బహిరంగ సభకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభకు కేసీఆర్ ప్లాన్ చేశారు. అదే సమయంలో వరంగల్ లోనూ ఒక సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
ఇక ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సమావేశాలకు హాజరవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి సమావేశాలకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేసారని అధికార పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్ అధినేత పాల్గొంటారని గులాబీ వర్గాలంటున్నాయి. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం, అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ చేయడం.. మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం.. అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
ఇక ఎమ్మెల్సీ ఎంపిక విషయంలోనూ సమావేశంలో చర్చించారు. బీఆర్ఎస్ కు ఒక స్థానం మాత్రమే దక్కనుండడంతో దాన్ని ఎవరికి కేటాయిస్తారనే అంశం కీలకంగా మారింది. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సత్యవతి రాథోడ్ పదవికాలం ముగిసింది. ఆమె గత మంత్రి వర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆమెకు మరోసారి అవకాశం ఇస్తానని ఆధినేత హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో తిరిగి ఆమెకు కేటాయిస్తారా లేదా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన ప్రవీణ్ కుమార్ కు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. ఇక్కడ ఇద్దరు కూడా వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారే కావడంతో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనే విషయంలో సందిగ్ధత ఉంది. ప్రవీణ్ కుమార్ కు ఇస్తే సభలో అధికార పక్షానికి ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధినేత భావిస్తున్నారట. అలాగే సత్యవతి రాథోడ్ ను పార్టీ కార్యక్రమాలకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ప్రవీణ్ కుమార్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడుతారన్న ప్రచారం కూడా ఉంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్‌లో సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలోప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్. కాగా ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్, కవిత, పద్మారావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, కేఆర్ సురేశ్, బండా ప్రకాశ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వినోద్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే