RTI Commissioners : గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియమకాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం నలుగురి పేర్లను మాత్రమే ప్రకటించగా మరో ముగ్గురికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీఐ కమిషనర్లుగా పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి మే 5న బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం బోరెగాన్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి1991 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. అయన ఏప్రిల్30 వరకు పీసీసీఎఫ్‌గా, అంతకుముందు సీఎంవో సెక్రటరీగా పనిచేశారు.
ఇది కూడా చూడండి: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO
కాగా ఆర్టీఐ కమిషనర్లుగా ఏడుగురికి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుతం ఆర్టీఐ కమిషనర్లుగా కొత్తగా నలుగురిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నియమితులైనవారిలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాస్ రావు ఉన్నారు. ఆయన గతంలో టీన్యూస్‌తో పాటు పలు ఛానల్స్ లో పనిచేశారు. ఇక యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి సాక్షి తో పాటు ఇతర మీడియా సంస్థల్లో పనిచేశారు. అయితే ఆయనను గతంలోనే సీఎం సీపీఆర్వోగా నియమించారు. ప్రస్తుతం ఆయనను ఆర్టీఐ కమిషనర్‌గా నియమించడంతో సీఎం సీపీఆర్వోగా మరోకరికి అవకాశం ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇక మైనార్టీ కోటాలో పర్వీన్ మొహిసిని ప్రభుత్వం ఎంపిక చేసింది. మరో ముగ్గురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ పరిశీలనకు పంపినప్పటికీ వారి విషయంలో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం నలుగురికి మాత్రమే అవకాశం వచ్చింది.
ఇది కూడా చూడండి: రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO
గడచిన రెండు సంవత్సరాలుగా ఆర్టీఐ కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్ లో ఉండిపోయాయి. ఈ విషయమై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఆలస్యంపై సుప్రీంకోర్టు 2025 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక ఆర్టీఐ నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ క్రమంలోనే ప్రభుత్వం ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అయితే గత కొన్నేళ్లుగా వినపడుతున్న వారినే ప్రభుత్వం నియమించడం గమనార్హం. ఈ విషయంలో పలువురు దరఖాస్తుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన ఇష్టానుసారం ఆర్టీఐ కమిషనర్ల నియామకం చేయాలనుకున్నప్పుడు దరఖాస్తులు స్వీకరించడం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చే సేందుకు ఎంపిక చేసిన వారి జాబితాను రాష్ట్ర రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్ అభ్యంతరం చెప్పిన వారిని మినహాయించి మిగిలినవారిని కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది.
ఇది కూడా చూడండి: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన