/rtv/media/media_files/2025/09/03/kavita-2025-09-03-20-05-31.jpg)
Kavita
జాగృతి అధ్యక్షురాలు కవిత.. బీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానానికి మరో ఉప ఎన్నిక జరగనుంది. కవిత ఇప్పుడు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. బుధవారం ఆమె తన రాజీనామా లేఖను శాసన మండలి కార్యాలయానికి పంపించారు. తన రాజీనామాను ఆమోదించాలని గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ కూడా చేశారు. ఆమె రాజీనామా ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికల జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను కూడా విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కానీ బీసీ రిజర్వేషన్ అంశం వల్ల ఆలస్యమవుతోంది. ఇప్పటికే సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితులు చూస్తే మాత్రం ఈ నెలలో జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read: 2 కోట్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకో తెలుసా?
ఇప్పుడు కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించినా కూడా స్థానిక సంస్థల్లో పాలక మండళ్లు లేవు. దీనివల్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడే నిర్వహించడం సాధ్యం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి, పాలక మండళ్లు కొలువుదీరిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఉప ఎన్నిక కూడా ఆలస్యం కానుంది.
కవిత ఎమ్మెల్సీ పదవి కాలం చూసుకుంటే 2028 వరకు ఉంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆమె మరి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే ఆమె సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న వేళ.. అక్కడ తన బలం చూపించుకునేందుకు కవిత ప్లాన్ వేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఒకవేళ కవిత బరిలోకి దిగితే బీఆర్ఎస్‌కు నష్టం జరిగే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పగబట్టిన పాము.. 15 ఏళ్ల బాలికకు 42 రోజుల్లో 10 సార్లు కాటు.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. ఈ ఉప ఎన్నికతో పాటే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరగనుందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉపఎన్నిక, మరొకటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు కవిత కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకా ఎలాంటి మలుపులు తిప్పుతాయో అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి బయటికొచ్చిన కవితను తెలంగాణ ప్రజలు ఎలా ఆదరిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.