/rtv/media/media_files/2025/09/03/snake-bites-15-year-old-girl-10-times-in-42-days-in-uttar-pradesh-2025-09-03-19-11-34.jpg)
snake bites 15 year old girl 10 times in 42 days In uttar pradesh
ఇదొక విచిత్ర సంఘటన. ఒక పాము 15 ఏళ్ల బాలికకు 42 రోజుల్లో 10 సార్లు కాటు వేసింది. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఆ బాలిక హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతోంది. అయితే దీనిపై డాక్టర్లు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Snake Bite In UP
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లా సిరతు తహసీల్‌లోని భైంసహపర్ గ్రామంలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. భైంసహపర్ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థిని పేరు రియా. ఆమె గత 42 రోజుల్లో 10 సార్లు పాము కాటుకు గురైందని చెప్పింది. పదే పదే పాము కాటు సంఘటనలు జరుగుతుండటంతో ఒకవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
విద్యార్థిని రియా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటిసారిగా ఈ ఏడాది జూలై 22న పొలానికి వెళుతుండగా రియా పాము కాటుకు గురైంది. దీని తర్వాత ఆగస్టు 13న కూడా అదే సంఘటన జరిగింది. ఆగస్టు 27 నుండి ఆగస్టు 30 వరకు బాలిక రియాను వరుసగా నాలుగుసార్లు పాము కాటు వేసింది. దీని తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే మళ్ళీ పాము తనను కాటేసిందని రియా చెప్పింది.
కొన్నిసార్లు స్నానం చేస్తున్నప్పుడు, ఇంకొన్నిసార్లు ఇంటి పనులు చేస్తున్నప్పుడు పాము కాటేస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతుండటంతో కుటుంబం మొత్తం భూతవైద్యున్ని సంప్రదించారు.
అయితే ఈ విషయంపై కౌశాంబి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్.. ప్రొఫెసర్ హరి ఓం కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఒక పాము ఒకే వ్యక్తిని ఇన్నిసార్లు కాటేయడం వైద్య శాస్త్రంలో సాధ్యం కాదని అన్నారు. ఇది పాము కాటు వల్ల కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మానసిక సమస్య కావచ్చునని ఆయన తెలిపారు. ఒక వ్యక్తికి కుటుంబంలో లేదా సమాజంలో గౌరవం లభించనప్పుడు.. అతను అలాంటి భ్రమలకు గురవుతాడని పేర్కొన్నారు.
ఇలాంటి సమస్యకు మానసిక చికిత్స చాలా అవసరం అని.. మానసిక వైద్యుడి నుండి చికిత్స పొందిన తర్వాత రోగి సాధారణ స్థితికి రావచ్చునని డాక్టర్ సింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఒక ‘రెప్టిలియన్ ఫోబియా’ కావచ్చునని తెలిపారు. ఇది ఒక మానసిక స్థితి అని.. దీనిలో ఒక వ్యక్తికి పాములు, బల్లులు, మొసళ్ళు, తాబేళ్లు లేదా ఏదైనా ఇతర సరీసృపాల పట్ల తీవ్రమైన భయం ఉంటుందన్నారు.
కొన్నిసార్లు ఈ భయం చాలా తీవ్రంగా మారుతుందని తెలిపారు. ఆ వ్యక్తి ఈ జీవుల గురించి విన్నప్పుడు లేదా వాటి ఫొటోలు, వీడియోలు చూసినప్పుడు లేదా కేవలం ఊహించుకునే భయపడటం చేస్తుంటాడు అని పేర్కొన్నారు. దీనిని మానసిక వ్యాధుల భాషలో హెర్పెటోఫోబియా అని కూడా అంటారని తెలిపారు. అందువల్ల రియాకు వైద్య పరీక్షలు చేయించి, మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలని డాక్టర్ సూచించారు.