ప్రేమికుల పెళ్లికి పెద్దలు ఒప్పుకోకుంటే చాలామంది చేసే పని.. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడమే. వీళ్లలో మైనర్లు కూడా ఉంటున్నారు. గత ఐదేళ్లలో తెలంగాణలో లక్షమందిపైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 60 వేలకు పైగా ప్రేమికులే ఉండటం గమనార్హం. ఇలాంటి కేసుల్లో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రేమికులు మేజర్లైతే వాళ్ల ఇష్టానికి వదిలేస్తున్నారు. ఒకవేళ మైనర్లు అయితే వాళ్ల తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.
60 శాతం ప్రేమికులే
ఇలాంటి కేసుల్లో పోలీసులు ఎంతో కష్టపడి 85 శాతం కేసులను ట్రేస్ చేస్తున్నారు. మరో 15 శాతం కేసులు మాత్రం మిస్టరీగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఐదేళ్లలో తెలంగాణలో మొత్తం 1,03,496 మంది మిస్సయ్యారు. ఈ కేసుల్లో 60 శాతం ప్రేమికులే ఉన్నట్లు సీఐడీ ఎంక్వైరీలో తేలింది. వీళ్లలో 97,028 మందిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇక ఏడాదిలో నవంబర్ వరకు 22,780 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.
Also Read: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,100 ఆర్థిక సాయం
వీటిలో 19,191 కేసులను పోలీసులు ఛేదించారు. అయితే ఈ మిస్సింగ్ కేసులను పరిష్కరించడంలో రాష్ట్ర సీఐడీ పోలీసులు 85 శాతం సక్సెస్ కాగా.. మిగిలిన 15 శాతం మిస్టరీగా మిగులుతున్నాయి. అయితే మిస్సింగ్ అయ్యి దొరుకుతున్నవాళ్లలో కొందరికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కనీసం వాళ్ల అడ్రస్ కూడా చెప్పలేకపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. మరికొందరు చనిపోతున్నారని అంటున్నారు.
మిస్సింగ్ కేసు నమోదయ్యాక స్థానిక పోలీస్ స్టేషన్ల పరిధిలో 3 నెలల్లో పరిష్కారం కాకపోతే సీఐడీకి బదిలీ చేస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో 20 శాతం మంది మహిళలు ఉంటున్నారు. వీళ్లలో చాలామంది గృహిణులు ఉన్నారు. కుటుంబ కలహాలతో వీరు ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మరో 10 శాతం మంది 60 ఏళ్ల పైబడినవారు ఉన్నారు. మరో 10 శాతం మంది చిన్నారులు ఉంటున్నారు. కుటుంబాల్లో ఆలనాపాలన లేక చిన్నారులు, వృద్ధులు మిస్సవుతున్నారు. మిగతా 60 శాతం యువతీయువకులే అదృశ్యమవుతున్నారు.
Also read: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా..కేంద్రం ఏర్పాట్లు
ఇళ్ల నుంచి పారిపోతున్న ప్రేమికులకు సంబంధించి స్థానిక పోలీసులు మొదటగా మిస్సింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నారు. మైనర్లు అదృశ్యమైనప్పుడు కిడ్నాప్ కేసు పెట్టి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో చాలామంది మైనర్లు ప్రేమ పేరుతోనే ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ప్రభావమే దీనికి కారణవుతోందని చెబుతున్నారు. ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోతున్న యువతీయువకులు ఎక్కువగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు అలాగే బెంగళూరు, ముంబయికి కూడా వెళ్తున్నారు. కొన్ని రోజుల తర్వాత తమ వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోయి ఆర్థిక సమస్యలు రావండతో మళ్లీ సొంతూర్లకు వెళ్లిపోతున్నారు.