India vs Ireland T20: కరీబియన్ గడ్డపై పోరాటం ముగియడంతో యంగ్ ఇండియా.. ఐర్లాండ్ దీవిలో అడుగుపెట్టింది. పసికూన జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు రెడీ అయింది. అయితే ఈ సిరీస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా రెగ్యులర్ ఆటగాళ్లు కాకుండా యువ ఆటగాళ్లు బరిలో దిగుతున్నారు. ముఖ్యంగా ఈ సిరీస్ బుమ్రాకు పరీక్ష కానుంది. బుమ్రా ఫిట్‌నెస్, బౌలింగ్‌లో పాస్ అయితే టీమిండియాకు (Team India) మంచి రోజుల వచ్చినట్లే. ఎందుకంటే త్వరలోనే ఆసియా కప్‌తో పాటు వరల్డ్‌కప్ టోర్నీలు జరగనున్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి బుమ్రాపైనే ఉంది.
ఇక ఐపీఎల్ స్టార్లు రింకూ సింగ్ (Rinku Singh), జితేశ్ శర్మ, రుతురాజ్ (Ruthuraj), శివమ్ దూబేల (Shivam Dube)కు తమ భవిష్యత్‌కు ఈ సిరీస్ మంచి ప్లాట్‌ఫామ్ కానుంది. జాతీయ జట్టులో చోటును ఖరారు చేసుకునేందుకు కుర్రాళ్లకు మంచి అవకాశం ఇది. ఆసియా గేమ్స్‌లోనూ దాదాపు ఈ జట్టే ఆడనుంది. అయితే సంజూ శాంసన్‌కు (Sanju Samson) మాత్రం ఈ సిరీస్ డూ ఆర్ డై లాంటిది. ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో ఈ సిరీస్‌లో సత్తా చాటి ఫామ్ చాటాలనుకున్నాడు. అయితే సంజూ ప్లేస్‌కు జితేశ్ రూపంలో గట్టి పోటీ ఏర్పడింది. మరోవైపు ఐపీఎల్‌లో సిక్సర్లతో అదరగొట్టిన రింకూ సింగ్‌పై కూడా అభిమానులు, సెలెక్టర్లు అంచనాలు పెట్టుకున్నారు. ఇక రుతురాజ్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.. స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, షాబాజ్, వాషింగ్టన్ సుందర్ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు .
మరోవైపు టీమిండియాపై ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఐర్లాండ్ జట్టును (Ireland Team) తక్కువ అంచనా వేయకూడదు. ఆ టీంలో ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చే మంచి హిట్టర్లు ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించిన ఐర్లాండ్.. ఇండియాతో సిరీస్ కోసం అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్‌కు జట్టు పగ్గాలు అప్పచెప్పింది. బ్యాటింగ్‌లో బల్బిర్నీ, అడెయిర్, స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, టక్కర్ భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడగలరు. ఇక పేస్ బౌలర్ జోష్ లిటిల్‌కు ఐపీఎల్‌లో గుజరాత్‌కు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు టీ20ల సిరీస్ టిక్కెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. తొలి రెండు మ్యాచ్‌ల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోవడం విశేషం.
India vs Ireland తుది జట్లు(అంచనా):
భారత్: బుమ్రా (కెప్టెన్), రుతురాజ్, జైస్వాల్, తిలక్ వర్మ, దూబే, రింకూ సింగ్, శాంసన్/జితేశ్, వాషింగ్టన్ సుందర్, బిష్ణోయ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ క్రిష్ణ.
ఐర్లాండ్: స్టిర్లింగ్ (కెప్టెన్), బల్బిర్నీ, టక్కర్, టెక్టర్, కాంఫర్, హ్యాండ్, డాక్‌రెల్, అడెయిర్, మెక్‌కార్తి, జోష్ లిటిల్, వైట్.
Also Read: లక్నో జెయింట్స్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా తెలుగు వ్యక్తి