Hema Committee Report: మాలీవుడ్‌లో స్త్రీ పరిస్థితులపై వేసిన హేమ కమిటీ రిపోర్ట్‌ను సబ్ మిట్ చేసింది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ తన నివేదికలో చెప్పింది. పలువురు సాక్ష్యాలు చెప్పిన వివరాల ప్రకారం, కమిటీ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయాలను బయటపెట్టింది. ఇక్కడ సినీ పరిశ్రమలో మహిళలకు సరైన టాయిలెట్ సౌకర్యాలు కూడా లేవు. బట్టలు మార్చుకునేందుకు సురక్షితమైన గదుల్లేక నటులు ఇబ్బందులు పడుతున్నారని కమిటీ చెప్పింది.
మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ కూడా చాలా ఎక్కువే ఉందని అంటోంది హేమ కమిటీ. సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలు, మహిళలు…ఏదో ఒక టైమ్‌లో కొందరితో సన్నిహితంగా మెలగాల్సిందేనని అంటున్నారు. ఇలాంటి వాటికి ఒప్పుకుంటేనే సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తున్నారు. అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనే పదాలు మలయాళ ఇండస్ట్రీలో చాలా సర్వసాధారణమని కమిటీ చెబుతోంది. ఇక సినిమా షూటింగ్ టైమ్‌లో అయితే మహిళల గదుల తలుపులు తడుతూనే ఉంటారుట. తాగి వచ్చి మరీ గోల చేస్తారని తెలుస్తోంది. వాటిని తెరిచేవరకూ.. బలవంతంగా, డోర్లు పగిలేలా శబ్దాలు చేస్తారు. అందుకే చాలామంది మహిళా నటులు తమతో పాటూ ఎవరినో ఒకరిని తోడుగా తీసుకువస్తుంటారని చెబుతున్నారు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే..స్టార్ డమ్ పెరిగే కొద్దీ ఈ వేధింపులు ఇంకా ఎక్కువ అవుతాయని హేమ కమిటీ నివేదిక చెబుతోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు తెలిపింది.
ఇక మహిళలకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలోనే ఇక్కడ చాలా వివక్ష ఉందని హేమ కమిటీ చెప్పింది. మహిళలు, జూనియర్ ఆర్టిస్ట్‌లకు పూర్తి వేతనాలు చెల్లించడం లేదని తెలిపింది. ఇండస్ట్రీ అంతా కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ హౌస్‌ల చేతుల్లోనే ఉందని చెప్పింది.